
మత్స్యకారులకు ముగిసిన శిక్షణ
కూసుమంచి: పాలేరులోని పీవీ నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో పది జిల్లాల మత్స్యకారులకు ఇస్తున్న మూడు రోజుల శిక్షణ శనివారం ముగిసింది. ‘జలాశయాల్లో మత్స్య అభివృద్ధి – యాజమాన్య పద్ధతులు’ అనే అంశంపై ఇచ్చిన శిక్షణకు ఖమ్మం, నిజామాబాద్, హనుమకొండ, సూర్యాపేట, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల మత్స్యకారులు పాల్గొన్నారు. కాగా, ముగింపు సమావేశంలో సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి బి.నాగులునాయక్ మా ట్లాడుతూ.. శిక్షణను మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని మత్స్య అభివృద్ధి సాధించాలని, తద్వారా రాష్ట్రాన్ని ఆక్వా హబ్‌గా మార్చాలని సూచించారు. చేపల పెంపకంతో పాటు మార్కెటింగ్ కూడా కీలకమైనందున మెళకువలు నేర్చుకోవాలని పేర్కొ న్నారు. మత్స్యపరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్‌తో పాటు శాస్త్రవేత్తలు శాంతన్న, రవీందర్, నాగరాజు మాట్లాడగా శిక్షణలో పాల్గొన్న వారికి నైపుణ్య సర్టిఫికెట్లు అందజేశారు.
ఇసుక లారీ సీజ్
పాల్వంచరూరల్: మండల పరిధిలోని నాగారం నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న ఇసుక లారీని పోలీసులు పాల్వంచలోని దమ్మపేట సెంటర్‌లో శనివారం రాత్రి పట్టుకున్నారు. ఇసుక తరలింపునకు అనుమతులు, ఆధారాలు లేకపోవడంతో లారీని సీజ్ చేసినట్లు వెల్లడించారు.