
హైపర్.. టెన్షన్
అధిక రక్తపోటుతో అనర్థాలెన్నో..
● యుక్త వయస్సులోనే గురవుతున్న యువకులు ● ఆధునిక జీవన శైలితో పెరుగుతున్న బాధితులు ● ముందస్తు జాగ్రత్తలతో నివారణ సాధ్యమే.. ● నేడు వరల్డ్ హైపర్ టెన్షన్ డే
భద్రాచలంఅర్బన్: ఆధునిక జీవనశైలితో రక్తపోటు (బీపీ) బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చాలామందికి బీపీ ఉందన్న విషయం తెలుసుకునేలోపే దీని వల్ల కలిగే అనర్థాలతో శరీరంలోని పలు అవయవాలు దెబ్బతింటున్నాయి. 120/80 ఉంటే సాధారణ బీపీగా లెక్కిస్తారు. ఇటీవల చిన్న వయస్సులోనే దీని బారిన పడుతున్నవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతోంది. ప్రజలకు అవగాహన కలిగించానికి వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ (డబ్ల్యూహెచ్‌ఎల్) సంస్థ 2005 నుంచి ఏటా మే 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డే నిర్వహిస్తోంది.
సైలెంట్ కిల్లర్..
శరీరంలో రక్తాన్ని అన్ని రక్తనాళాలకు గుండె ఒత్తిడి చేసి (ప్రెజర్) పంపిస్తోంది. అధిక వేగంతో రక్తాన్ని ప్రసరింపజేసే శక్తినే బ్లడ్ ప్రెజర్‌గా పేర్కొంటారు. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్‌గా కూడా వైద్యులు పిలుస్తారు. చాలామందికి రక్తపోటు లక్షణాలు ఉన్నట్లు కూడా తెలియకపోవడం వల్ల ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి కుప్పకూలి పోతారు. తలనొప్పి, అలసట అనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించాలి. బీపీ చెకప్ చేయించుకోవాలి. పైరెండు లక్షణాలతో పాటు ముక్కు నుంచి రక్తం కారడం, ఊపిరి తీసుకోలేకపోవడం, చూపు సక్రమంగా కనిపించక పోవడం, చాతి నొప్పి వంటి లక్షణాలు బీపీ సోకిన వారిలో కనిపిస్తాయి.
కారణాలు..
అధిక రక్తపోటు సాధారణంగా వయస్సు మళ్లిన వారికి, కొందరికి జన్యుపరమైన కారణాలతో వస్తుంది. ధూమపానం, మద్యపానం, ఊబకాయం, పనిచేయకుండా ఒకేచోట గంటల తరబడి ఉండటం, హైపోథెరాయిడ్, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సరిపడా నిద్ర, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక మూత్ర పిండాల జబ్బు ద్వారా వస్తుంది. రోజువారి ఆహారంలో ఉప్పు, పచ్చళ్లు ఎక్కువగా తినడం, ప్యాక్ చేసి, నిల్వ చేసిన ఆహార పదార్థాలు తినడం ద్వారా బీపీ బారినపడుతున్నారు. జనరల్ ఫిజీషియన్, కార్డియాలజిస్టు, నెఫ్రాలజిస్టు వైద్యుల వద్దకు చికిత్స కోసం వెళ్లేవారిలో ఎక్కువ శాతం మంది అధిక రక్తపోటు బాధితులే.
బీపీతో గుండెకు చేటు..
అధిక రక్తపోటు గుండెకు చేటు. చికిత్స కోసం వచ్చేవారిలో 30 శాతం మంది బీపీ వల్ల గుండెపోటుకు గురైన వారే. అధిక రక్తపోటుతో బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కంటి సంబంధిత సమస్యలు కూడా ఉత్పన్నమ వుతా యి. ప్రతి ఒక్కరూ బీపీపై అవగాహన పెంచుకోవాలి.
–డాక్టర్ సాయితేజరెడ్డి, కార్డియాలజిస్ట్,భద్రాచలం
ఇంటింటికీ వెళ్లి బాధితుల గుర్తింపు..
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎన్సీడీ కార్యక్రమం ద్వారా జిల్లావ్యాప్తంగా ఇంటింటికీ వైద్యసిబ్బంది ద్వారా పరీక్షలు చేయించి బాధితులను గుర్తించి, చికిత్స అందిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 30 ఏళ్లు పైబడి ఉన్న 6,23,444 ఉన్న వారికి ఎన్సీడీ ఆధ్వర్యంలో పరీక్షలు చేయాల్సి ఉంది. నేటి వరకు 30 ఏళ్లు దాటిన 4,88,761 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. వీరిలో 87,463 మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్న ట్లు జిల్లా వైద్య అధికారులు నిర్ధారించారు. స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లోనే వారికి ఉచితంగా మందులు అందిస్తున్నారు.
ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం..
ఆధునిక జీవనశైలి వల్ల వయస్సుతో సంబంధం లేకుండా అధిక రక్తపోటు బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఆహారంలో ఐదు గ్రాములకు మించి ఉప్పు తీసుకోవద్దు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. సొంత వైద్యం కాకుండా వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి.
–డాక్టర్ రమేశ్‌చంద్ర, సీనియర్ జనరల్ ఫిజీషియన్

హైపర్.. టెన్షన్

హైపర్.. టెన్షన్