
వృద్ధురాలు అదృశ్యం
చింతకాని/కొణిజర్ల: ఆస్పత్రికి బయలుదేరిన వృద్ధురాలు కానరాకుండా పోయిన ఘటన ఇది. చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన బొగ్గుల కాశమ్మ(65) గురువారం ఉదయం ఆటోలో కొణిజర్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ వైద్యుడు లేకపోవడంతో బయటకు వచ్చింది. తొలుత ఆమె పెద్దగోపతి గ్రామీణ వికాస బ్యాంకులో రూ.5వేలు విత్‌డ్రా చేసినట్లు తెలియగా, ఆతర్వాత ఇంటికి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆమె కుమారుడు సీతారాంరెడ్డి శుక్రవారం కొణిజర్ల, చింతకాని పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తల్లాడ: మండలంలోని మిట్టపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని రామానుజవరానికి చెందిన దర్శనాల వెంకటేశ్వర్లు(60) మూడు రోజులుగా మధ్యం సేవిస్తూ తిరుగుతున్నాడు. మిట్టపల్లి వద్ద జాతీయ రహదారి పక్కన ఓ షాపులో మద్యం తాగి నడిచి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన అల్లుడు బీరెల్లి రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి..
వేంసూరు: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని లింగపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాంపల్లి ఈశ్వరాచారి(42) ఇంటి మందు ఉన్న కార్పెంటర్ షెడ్‌లో పడి ఉన్న విద్యుత్ వైర్‌ను సరిచేస్తున్నాడు. ఈక్రమంలో షాక్‌కు గురి కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈశ్వరాచారి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వీరప్రసాద్ తెలిపారు.
వడదెబ్బతో బాలిక..
రఘునాథపాలె: వడదెబ్బ బారిన పడిన విద్యార్థిని మృతి చెందింది. రఘునాథపాలెం మండలం పాపటపల్లికి చెందిన గ్రామీణ వైద్యుడు కస్తాల రాంబాబు – రాణి దంపతుల చిన్న కుమార్తె శరణ్య(14) ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణత సాధించింది. వేసవి సెలవుల నేపథ్యాన కొత్తగూడెంలోని బంధువులు ఇంటికి వెళ్లగా శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటర్‌లో చేర్చేందుకు సిద్ధమవుతుండగా వడదెబ్బతో కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు.
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సత్తుపల్లి మండలం నారాయణపురానికి చెందిన చీకటి దీప్తి(28) గంగారంలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. ఈ నెల 14న ఆమెను తల్లిదండ్రులు మందలించారనే మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయాన కలుపు మందు తాగింది. కాసేపటికి గుర్తించిన కుటుంబీకులు సత్తుపల్లికి, అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.