
గిరిజన సంస్కృతిని పరిరక్షించాలి
ములకలపల్లి : గిరిజన సంస్కృతిని పరిరక్షించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అన్నారు. మండల పరిధిలోని రాజీవ్‌నగర్‌లో గురువారం నిర్వహించిన భూమి పండుగ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీలు ఏ కార్యం తలపెట్టినా గ్రామదేవతలను పూజించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అనంతరం స్థానిక యువకులతో కలసి బాణం సంధించారు. ఆ తర్వాత పాత గుండాలపాడు గ్రామాన్ని సందర్శించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. 35 ఏళ్ల క్రితం అప్పటి పీఓ జేసీ శర్మ తమ గ్రామాన్ని సందర్శించారని, మళ్లీ ఇప్పడు రాహుల్ రావడం ఆనందంగా ఉందని స్థానికులు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డును పూర్తి చేయాలని, ఐటీడీఏ ద్వారా వ్యవసాయ మోటార్లు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో భద్రాచలం గిరిజన మ్యూజియం ఇన్‌చార్జ్ వీరస్వామి, గ్రామపెద్దలు తుర్రం శ్రీను, మాజీ ఎంపీటీసీ నూపా సరోజిని తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్