
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
టేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మండలంలోని ముత్యాలంపాడు క్రాస్‌రోడ్ గ్రామానికి చెందిన బోడ భద్రు(47) ఈ నెల 13న రాత్రి చుక్కాలబోడులో ఓ శుభకార్యానికి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో మంగళితండా సమీపంలో గేదెలను బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఖమ్మం, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య తార, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో..
● రూ.4.61లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన మండలోజు భార్గవి అనే యువతి వద్ద డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాడు భారీగా నగదు కాజేశాడు. వివరాలు ఇలా.. గత ఏడాది డిసెంబర్ 27న యువతికి ఓ వ్యక్తి వాట్సప్ వీడియో కాల్ చేశాడు. నీ ఐడీ ప్రూఫ్స్ తో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని, డిజిటల్ అరెస్ట్ చేశామని చెప్పి భయపెట్టాడు. ఆమె నుంచి డిసెంబర్ 27 నుంచి 2025 జనవరి 1వ తేదీ వరకు పలు దఫాలుగా వివిధ అకౌంట్ నంబర్లకు రూ. 4.61 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రూ. 84,634 నగదు హోల్డ్‌లో పెట్టారు. బాధితురాలు గురువారం మళ్లీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులకు గాయాలు
టేకులపల్లి: బైక్ అదుపు తప్పి కింద పడి తండ్రీ కొడుకులు గాయపడ్డ ఘటన గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా రఘునాథపాలేనికి చెందిన కె.వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు రమేష్ బైక్‌పై మణుగూరులో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో సాయపేట దాటిన తర్వాత మూలమలుపు సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. అదే సమయంలో ఇల్లెందు నుంచి టేకులపల్లికి విధులకు వస్తున్న విద్యుత్ ఏఈ హట్కర్ దేవా గమనించి క్షతగాత్రులను ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆస్పత్రిలోలో చేర్పించారు.