
సెల్ టవరెక్కిన యువకుడు
జూలూరుపాడు: భూ వివాదంలో న్యాయం చేయాలని ఓ యువకుడు బుధవారం సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. మండలంలోని వెంగన్నపాలెం గ్రామానికి చెందిన మోటపోతుల కుటుంబీకులకు, దేవరకొండ కుటుంబీకుల మధ్య కొన్నేళ్లుగా భూ వివాదం ఉంది. మండల కేంద్రం సమీపంలో తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కన 69/ఆ సర్వే నంబర్‌లో ఐదెకరాల వ్యవసాయ భూమి విషయమై ఇరుపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. కాగా తమకు కోర్టు స్టే ఆర్డర్ వచ్చిందంటూ బుధవారం మోటపోతుల కుటుంబీకులు భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు సిద్ధపడగా, దేవకొండ కుటుంబీకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని కోర్టు స్టే ఆర్డర్ ఉందని, ఫెన్సింగ్ పనులను అడ్డుకోరాదని దేవరకొండ కుటుంబీకులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ క్రమంలో మనస్తాపం చెంది దేవరకొండ నరసింహారావు అనే యువకుడు వెంగన్నపాలెంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని నచ్చజెప్పడంతో కిందకు దిగాడు. ఈ సందర్భంగా నర్సింహారావు మాట్లాడుతూ తన తాత దేవరకొండ చిన్న బ్రహ్మయ్య పేరున ఉన్న భూమిని మోటపోతుల ఆగయ్యకు కౌలు నిమిత్తం ఇచ్చామని, ఆగయ్య కుటుంబీకులు అక్రమంగా పట్టా చేయించుకున్నారని ఆరోపించాడు.
భూ వివాదంలో న్యాయం చేయాలని నిరసన