
సర్కారు స్కూళ్లలో అడ్మిషన్లు పెంచాలి
కొత్తగూడెంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ఉత్తమ బోధన అందిస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ఈ తరగతులు ఉపకరిస్తాయని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతి గదుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, మౌలిక భాష, గణిత అభివృద్ధి కార్యక్రమాలను ఏఐ ఆధారంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైన వివరాలు డీఈఓకు తెలియజేస్తే పనులు చేపడతామని చెప్పారు. ఉపాధ్యాయులు శక్తివంతులని, పిల్లలకు నాణ్యమైన విద్యనందించడం వారికే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి, అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్.సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో పాఠ్యపుస్తకాలు..
పాఠశాలల పునః ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందిస్తామని కలెక్టర్ పాటిల్ చెప్పారు. కొత్తగూడెంలోని పాఠ్యపుస్తకాల గోడౌన్‌ను పరిశీలించాక మాట్లాడారు. ఇప్పటికే 70 శాతం పుస్తకాలు జిల్లాకు చేరాయని, మిగిలినవి ఈనెల 25 లోపు వస్తాయని, ఆ వెంటనే మండలాలకు సరఫరా చేస్తామని తెలిపారు. అక్కడి నుంచి పాఠశాలల ఉపాధ్యాయులు తీసుకెళ్లాలని సూచించారు.
ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచన