
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కనులపండువగా దొంగల దోపు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మహోత్సవాల్లో భాగంగా బుధవారం దొంగల దోపు వేడుక కనులపండువగా సాగింది. ముందుగా ఆలయంలో వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మహిళా భక్తుల కోలాటాల నడుమ ఆలయం నుంచి గోదావరి తీరానికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత నదిలో తెప్పోత్సవం గావించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎల్.రమాదేవి, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.