
కొబ్బరి తోటలో చిరుతపులి సంచారం !
అశ్వారావుపేటరూరల్: ఓ కొబ్బరి తోటలో చిరుత పులి సంచరించినట్లు బుధవారం ఉదయం ప్రచారం జరిగింది. దీంతో రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేటమాలపల్లి నుంచి నందమూరినగర్‌కు వెళ్లే మార్గమధ్యలో జూపల్లి వెంకట రామారావుకు కొబ్బరి తోట ఉంది. తోట వద్దకు వెళ్లిన రైతుకు కొద్ది దూరంలో చిరుత పులి మాదిరిగా ఓ జంతువు కనిపించింది. దీంతో రైతు స్థానికులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్టు రేంజర్ మురళీకృష్ణ తన సిబ్బందితో కలిసి కొబ్బరి తోటతోపాటు, చుట్టు పక్కల దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు చిరుత పులి పాదముద్రల కోసం విస్తృతంగా గాలించారు. కానీ ఆయా ప్రదేశాల్లో ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాలేదు. దీంతో చిరుత పులి సంచారంలో వాస్తవం లేదని, పాదముద్రలు, ఇతర ఆధారాలు లభ్యం కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేంజర్ తెలిపారు.
ఆనవాళ్లు లభ్యం కాలేదన్న ఫారెస్టు రేంజర్