
భారీ వర్షం.. పిడుగుపాటు
● మణుగూరులో తడిసిన ధాన్యం ● బచ్చువారిగూడెంలో గృహోపకరణాలు దగ్ధం
అశ్వారావుపేటరూరల్: పలు గ్రామాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతోపాటు భారీ వర్షం కురిసింది. ఓ గ్రామంలో పిడుగుపడటంతో ఇంట్లో ఉండే గృహాపకరణాలు దగ్ధమయ్యాయి. మండల పరిధిలోని బచ్చువారిగూడెం, గుమ్మడవల్లి, కొత్తురు, మామిళ్లవారిగూడెం, కొత్త మామిళ్లవారిగూడెం, తిరుమలకుంట, తిరుమలకుంట కాలనీతోపాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. బచ్చువారిగూడెం పంచాయతీ కార్యాలయ భవనంపై పిడుగుపడింది. దీంతో జీపీ భవనంలో ముందు భాగం కొంతమేర ధ్వంసం కాగా, పైన ఉన్న సోలార్ పరికరాలతోపాటు లోపల ఉన్న స్విచ్ బోర్డులు, వైర్లు మొత్తం కాలిపోయాయి. గ్రామంలోని టీవీలు, ఫ్యాన్లు, బల్బులు, కూలర్లు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి. కాగా అశ్వారావుపేట, అచ్యుతాపురం, ఊట్లపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యంపై రైతులు ఉరుకులు, పరుగులతో పట్టాలు కప్పారు.
నీట మునిగిన ధాన్యం
మణుగూరు టౌన్: భారీ వర్షంతో కల్లాల్లోకి వరద నీరు చేరి ధాన్యం తడిసింది. మండలంలో పలు చోట్ల కల్లాల్లో ఎండబోసిన ధాన్యంపై పట్టాలు కప్పినా తడిసిపోవడంతో రైతులు మనోవేదన చెందుతున్నారు. రోడ్లపై వరద నీరు చేరి ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

భారీ వర్షం.. పిడుగుపాటు