
పీవీ కాలనీలో దొంగల బీభత్సం
మణుగూరుటౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో కార్మిక కుటుంబాలు నివసించే క్వార్టర్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకకాలంలో ఏడు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. కార్మిక కుటుంబాలు, పోలీసుల కథనం ప్రకారం.. ఎంసీ క్వార్టర్ 316లో నివసించే నాజర్‌పాషా బంధువుల ఇంటికి వెళ్లి వచ్చి చూడగా తాళాలు పగులగొట్టి బీరువాల్లో ఉన్న రూ.5 వేల నగదు, 10 తులాల వెండి అపహరించారు. దగ్గరలో ఉన్న మరో క్వార్టర్ 304లో కల్యాణపు రవికుమార్ 12న నైట్‌షిఫ్ట్ డ్యూటీకి వెళ్లి 13న వచ్చి చూడగా తలుపులు పగులగొట్టి, బీరువాలోని ఆరు గ్రాముల బంగారం, రూ.10 వేల నగదు చోరీకిగురైంది. మరో మూడు చోట్ల దొంగతనానికి యత్నించగా, అక్కడ ఇంట్లో నగదు, బంగారం లేకపోవడంతో స్వల్ప నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మేడా ప్రసాద్ ఘటనా స్థలాలను సందర్శించి బాధితుల నుంచి వివరాలు తెలుసుకుని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ నెల 3న రాత్రి సుందరయ్యనగర్‌లోని రెండు ఇళ్లల్లో, 12న రాత్రి మరో చోట చోరీ జరగడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇకనైనా పోలీసులు గస్తీని మరింత పెంచాలని కోరుతున్నారు.
బంగారం, నగదు అపహరణ