
టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం
● రాష్ట్రంలో 57వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం ● ‘వికాసం’ ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాలు ● బీఆర్‌ఎస్ ప్రభుత్వం యువతను మోసం చేసింది ● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
టేకులపల్లి : రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌లో రూ.1.15 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కోయగూడెంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని, ఆత్మగౌరవంతో బతకొచ్చని ఆశించిన యువతను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన తాము సుమారు 57వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించామని తెలిపారు. నిరుద్యోగులు స్వయం ఉపాధి సాధించేలా రూ.9వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. బయ్యారం చెరువు, తులారం ప్రాజెక్టు నీటి కోసం మహబూబాబాద్, ఇల్లెందు ఎమ్మెల్యేలు వినతిపత్రాలు ఇచ్చారని, సర్వే నిర్వహించి నీటిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, కలెక్టర్ జితేష్ వి పాటిల్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఐటీడీఏ పీఓ రాహుల్, ఇల్లెందు, వైరా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, మాళోతు రాందాస్ నాయక్, ఎస్పీ రోహిత్‌రాజు, ఆర్డీఓ మధు, అదనపు కలెక్టర్ విద్యాచందన, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మహేందర్, ఈఈ వెంకటేశ్వర్లు, డీఈలు నందయ్య, రంగస్వామి, ఏడీఈలు యాసిన్, హేమచంద్రబాబు, ఏఈ లు పి.బుజ్జికన్నయ్య, దేవా, కె వేణు, రాజేష్, నాయకులు కోరం సురేందర్, మడత వెంకట్‌గౌడ్, ఏలూరి కోటేశ్వరరావు, భూక్య దేవా, బానోత్ సుజాత, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.