
దరఖాస్తుల పరిశీలన వేగంగా సాగాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీఓ రాహుల్‌తో కలిసి మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హుల జాబితాను రూపొందించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల వారీగా విభజించాలని అన్నారు. అర్హుల జాబితాలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. జూన్ 2న లబ్ధిదారులకు మంజూరుపత్రాలు అందజేసేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లకు గాను మొదటి విడతలో మండలానికి ఒక గ్రామపంచాయతీని ఎంపిక చేశామని, మిగిలిన పంచాయతీల్లో అర్హుల జాబితా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ‘జల్ సంచయ్ జెన్ భాగీధారి’ పథకం కింద జిల్లాలో భారీగా ఇంకుడుగుంతల నిర్మాణం చేపడుతున్నామని, ఈ విషయంలో జిల్లా దేశంలోనే మొదటి స్థానానికి చేరువలో ఉందని వివరించారు. ప్రథమ స్థానం పొందిన జిల్లాకు రూ.2 కోట్ల బహుమానం వస్తుందని తెలిపారు.
టీబీ బాధితులకు పోషకాహార కిట్లు
జిల్లాలోని 1,030మంది టీబీ బాధితులకు గ్రా న్యూల్ ఇండియా లిమిటెడ్ ఔషధ సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ పాటిల్, సంస్థ ఈడీ చిగురుపాటి ఉమ చేతుల మీదుగా పోషకాహార కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ.. 2025 నాటికి టీబీనీ నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఈ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంస్థ మేనేజర్ అల్లం అవినాష్, డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జయలక్ష్మీ, పుల్లారెడ్డి, మధువరన్, హరీష్ పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం