
నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాలి
ఇల్లెందు : బొగ్గు ఉత్పత్తిలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సింగరేణి సీఎండీ బలరామ్ సూచించారు. మంగళవారం ఆయన ఇల్లెందులో ఏరియాలోని పూసపల్లి ఓసీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక జీఎం కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ.. పూసపల్లి ఓసీ పనులు త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని అన్నారు. ప్రణాళికాయుతంగా పని చేస్తూ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు డి.సత్యనారాయణరావు, కె.వెంకటేశ్వర్లు,ఎల్.సూర్యనారాయణ, ఏరియా జీఎం వీసం కృష్ణయ్య, అధికారులు రామస్వామి, కృష్ణమోహన్, మోహన్‌రావు, రవికుమార్ పాల్గొన్నారు. కాగా, పూసపల్లి ఓసీని త్వరగా ప్రారంభించాలని కోరుతూ గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి నజీర్‌అహ్మద్ ఆధ్వర్యంలో సీఎండీకి వినతిపత్రం అందజేశారు.
సీనియర్ల సలహాలు పాటించాలి
భద్రాచలంటౌన్: ఐటీడీఏ పరిధిలో హాస్టల్ సంక్షేమాధికారులుగా బాధ్యతలు చేపట్టిన వారు విధి నిర్వహణలో సీనియర్ల సలహాలు పాటిస్తూ పని చేయాలని పీఓ బి.రాహుల్ అన్నారు. ఎంపికై న అభ్యర్థులకు మంగళవారం నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలని, బాలికలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా ఎవరు సెలవులు పెట్టొద్దని, పిల్లల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ పాల్గొన్నారు.