
జామ్‌ఆయిల్‌తో ఆదాయం
ఆకులతో నూనె తయారీపై దృష్టి
● ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక ● రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా కలెక్టర్ చొరవ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా జామాయిల్ సాగవుతోంది. ఇప్పటివరకు జామాయిల్ కలప అమ్మడం ద్వారానే రైతులకు ఆదాయం వస్తోంది. తాజాగా జామాయిల్ ఆకుల ద్వారా కూడా ఆదాయం వచ్చే మార్గాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది.
ఐటీసీ ఆధారంగా జామాయిల్
దేశంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీల్లో ఉన్న ఐటీసీ సంస్థ సారపాకలో పేపర్ బోర్డు, స్పెషల్ పేపర్ డివిజన్ పేరుతో కర్మాగారం స్థాపించింది. ఈ సంస్థలో పేపర్ తయారీకి ముడి సరుకుగా యూకలిప్టస్ (జామాయిల్) కలపను ఉపయోగిస్తారు. దీంతో ఈ పరిశ్రమ వచ్చిన తర్వాత జిల్లాలో జామాయిల్ సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 27 వేల ఎకరాల్లో జామాయిల్ పంట సాగు చేస్తున్నారు. ఒకసారి మొక్కను నాటితే మూడున్నరేళ్ల నుంచి చెట్లను నరికి కలపను అమ్ముకోవచ్చు. ఒక్కసారి పంటను నాటితే కనీసం మూడూ దఫాలుగా అంటే పది నుంచి పన్నెండేళ్లపాటు దీన్ని సాగులో ఉంచుకోవచ్చు. ప్రస్తుతం జామాయిల్ సాగు చేస్తున్న రైతులు ప్రతీ మూడేళ్లకు ఒకసారి ప్రతిఫలం పొందుతున్నారు. సగటున ఒక ఎకరానికి కనిష్టంగా రూ.2.5 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అంతకు మించి మరే విధమైన ఆదాయం లేదు.
కుటీర పరిశ్రమలకు ఊతం
ఐటీసీ పేపర్ బోర్డు పరిశ్రమలో వేస్టేజ్‌గా వచ్చిన కలప గుజ్జుఽ ఆధారంగా బూర్గంపాడు మండలంలో పదుల సంఖ్యలో అట్టల తయారీ పరిశ్రమలు వచ్చాయి. కోడిగుడ్ల రవాణా, నిల్వకు ఉపయోగించే కాగితపు అట్టలు ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. అదే విధంగా ప్యాకేజీ అట్టలు కూడా ఇక్కడే రూపొందుతున్నాయి. ఫలితంగా బూర్గంపాడు మండలంలో సంజీవరెడ్డిపాలెం, లక్ష్మీనగరం, రెడ్డిపాలెం వంటి గ్రామాల్లో అనేక కుటీర పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడు ఆయిల్ తయారీ విధానం విజయవంతమైతే జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కుటీర పరిశ్రమలు వచ్చేందుకు ఆస్కారముంది. ఇప్పటికే మునగ సాగు – మునగ ఆకు మార్కెటింగ్‌పై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఈ రెండు ప్రయోగాలు సానుకూల ఫలితాలు ఇస్తే జిల్లాకు మరింత మేలు జరగనుంది.