
‘భరోసా’ కోల్పోతున్నారు..
● యాసంగి సాగు ముగిసినా అందని పెట్టుబడి సాయం ● నాలుగెకరాలు పైబడిన రైతులకు జమకాని రైతు భరోసా ● నాలుగు నెలలుగా కర్షకుల ఎదురుచూపులు
బూర్గంపాడు: యాసంగి పంటల సాగు ముగిసినా రైతు భరోసా పెట్టుబడి సాయం మాత్రం ఇంకా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు. రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి 26 నుంచి పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయటం ప్రారంభించింది. ఇప్పటివరకు నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే అందించింది. ఆ పైబడిన రైతులకు రైతు భరోసా అందలేదు. ఎప్పుడు అందుతుందో కూడా స్పష్టత లేదు. దీంతో జిల్లాలో వేలాదిమంది రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
అర్హులు 1,39,192 మంది
జిల్లాలో పట్టాదారు పాసు పుస్తకాలతో భూమి హక్కులు కలిగిన రైతులు 1,39,192మంది ఉన్నారు. వీరికి గతంలో ఎకరాకు రూ.5 వేల చొప్పున 4.30 లక్షల ఎకరాలకు రూ.215 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ఈ యాసంగి సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.6వేలకు పెంచింది. తొలుత జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని పెట్టుబడి సాయాన్ని అందించారు. తర్వాత ఫిబ్రవరిలో ఎకరం, రెండెకరాల భూమి ఉన్న రైతులకు జమ చేశారు. మార్చిలో మూడెకరాలోపు రైతులకు, ఏప్రిల్‌లో నాలుగెకరాల లోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా అందించారు. మొత్తంగా నాలుగెకరాలలోపు భూమి ఉన్న రైతులకు రూ.128 కోట్లు జమ చేశారు. కానీ నాలుగెకరాల పైబడిన రైతులకు రూ.117 కోట్ల వరకు జమ కావాల్సి ఉంది. యాసంగి పంటలు సాగు ముగిసి మరో 20 రోజుల్లో వానాకాలం పంటల సాగు మొదలవుతుంది. అప్పటివరకై నా రైతు భరోసా అందుతుందా లేదా అని రైతుల్లో చర్చ సాగుతోంది.
వానాకాలం సీజన్ సమీపిస్తున్నా..
జిల్లాలో ఎక్కువగా మెట్ట భూములు, పోడు భూములు ఉన్నాయి. చిన్న సన్నకారు రైతులే 70 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారు. వీరికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయమందింది. వానాకాలం, యాసంగి పంటల సాగుకు నెలన్నర రోజుల్లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ. 6 వేల చొప్పున పెంచి రైతులకు రైతు భరోసా అందజేస్తోంది. కాగా యాసంగిలో పెట్టుబడిసాయం అందజేత ప్రక్రియ నాలుగు నెలలుగా కొనసాగుతోంది. మరో వైపు వానాకాలం సీజన్ సమీపిస్తున్నా అందరికీ అందకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.