
ముందస్తు..అంతంతే
● మున్సిపాలిటీల్లో ఎర్లీబర్డ్‌కు నామమాత్ర స్పందన ● రూ.64.08 కోట్ల డిమాండ్‌లో రూ.6.19 కోట్లే వసూలు ● ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో సత్తుపల్లిలో అత్యధికం
కొంచెం ఆశ..
ఇంకొంచెం నిరాశ
ఎర్లీబర్డ్ పథకం అమలులో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇల్లెందు(శాతంలో) అగ్రస్థానాన నిలిచింది. ఇక్కడ అత్యధికంగా 1,384 మంది రూ.56 లక్షలు చెల్లించారు. మొత్తం రూ.2.23 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్‌లో 25.11 శాతం వసూలైంది. ఇక సత్తుపల్లి 25.04 శాతం(రూ.1.42కోట్లు) తో ఉమ్మడి జిల్లాలో ద్వితీయ స్థానాన నిలిచింది. మణుగూరు 18.30శాతం, మధి ర 15.85శాతం, కొత్తగూడెం 10.88 శాతం, వైరా 10.15 శాతం, పాల్వంచ 3.92 శాతం మాత్రమే ముందస్తు వసూళ్లు నమోదయ్యాయి.
సత్తుపల్లిటౌన్: మున్సిపాలిటీల్లో ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే అత్యధికంగా ఆస్తి పన్ను రాబట్టేలా రాష్ట్రప్రభుత్వం ఏటా మాదిరిగా ఐదు శాతం రాయితీతో ఈసారి కూడా ఎర్లీ బర్డ్ స్కీంను ప్రకటించింది. కానీ రాష్ట్ర పురపాలక శాఖ ప్రవేశపెట్టిన ఈ పథకానికి ఈసారి స్పందన అంతంత మాత్రంగానే లభించింది. ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రచార బోర్డులు ఏర్పాటు చేసి ప్రచారం చేయగా.. పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్నులు చెల్లించారు. కానీ గతంతో పోలిస్తే ఈసారి ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక,. విచారణలో బిల్‌కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు నిమగ్నమవడంతో ఎర్లీబర్డ్‌పై విస్తృతంగా అవగాహన కల్పించలేకపోయారు. దీంతో పన్నుల వసూళ్లపై ప్రభావం చూపింది.
సద్వినియోగం చేసుకున్నారు..
2025–26 ఆర్ధిక సంవత్సరానికి ఆస్తిపన్ను మొత్తం ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇవ్వడం ఎర్లీబర్డ్ పథకం ఉద్దేశం. ఏటా ఈ పథకం ద్వారా ఎక్కువ మొత్తం పన్ను రాబట్టేలా మున్సిపల్ పాలకవర్గాలు, అధికారులు కృషి చేస్తారు. కానీ ఈసారి పాలకవర్గాలు లేకపోగా.. అధికారులు ఇతర పని ఒత్తిడిలో పెద్దగా దృష్టి సారించలేదు. ఫలితంగా వసూళ్లలో వెనుకంజ వేసినట్లయింది. ఈసారి ఏప్రిల్ 30వ వరకే ఉన్న గడువును ఈనెల 7వ తేదీ వరకు పొడిగించినా ఆశించిన స్థాయిలో పన్నులు వసూలవకపోవడం గమనార్హం.
మున్సిపాలిటీ పన్ను డిమాండ్ చెల్లించిన వసూలైన శాతం
యజమానులు పన్నులు
ఇల్లెందు రూ.2.23కోట్లు 1,384 రూ.56 లక్షలు 25.11
సత్తుపల్లి రూ.5.67 కోట్లు 2,080 రూ.1.42కోట్లు 25.04
మణుగూరు రూ.2.35కోట్లు 1,244 రూ.43లక్షలు 18.30
మధిర రూ.4.01 కోట్లు 1,720 రూ.65 లక్షలు 15.85
కొత్తగూడెం రూ.12.87కోట్లు 3,026 రూ.1.40కోట్లు 10.88
వైరా రూ.4.53కోట్లు 828 రూ.46 లక్షలు 10.15
పాల్వంచ రూ.32.42కోట్లు 3,153 రూ.1.27కోట్లు 3.92