
ఇంకా ఎదురుచూపులే..
కొత్తగూడెంఅర్బన్: రేషన్‌కార్డులు లేక జిల్లాలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏ ప్రభుత్వ పథకానికై నా రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో అవి లేనివారు లబ్ధి పొందలేకపోతున్నారు. ప్రజాపాలన గ్రామసభలు, వార్డు సభల్లో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వాటిపై మండలాలు, మున్సిపాలిటీల్లో ఇంకా సర్వేలు కొనసాగుతూనే ఉన్నాయి. రెవెన్యూ అధికారులు సంబంధిత యాప్‌లో నమోదు చేశాక, ఆ వివరాలు సివిల్ సప్‌లై ఉన్నతాధికారులకు చేరి, అక్కడి నుంచి అప్రూవ్ వస్తేనే లబ్ధిదారులకు కార్డు మంజూరు చేస్తామని జిల్లా అధికారులు అంటున్నారు. అయితే ఈ విషయమై సరైన అవగాహన కల్పించకపోవడంతో చాలా మంది మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారు. తద్వారా సర్వే ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.
కొత్తగా వచ్చినవి 365 కార్డులే..
జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రజాపాలన, గ్రామ, వార్డు సభల్లో 53 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే మే నెలలో 365 కొత్త కార్డులు మాత్రమే మంజూరయ్యాయని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కాగా, 2017 నుంచి రేషన్‌కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి సంబంధించి ప్రక్రియ పెండింగ్‌లో ఉండగా.. ప్రస్తుతం వారి సమస్య పరిష్కారమైందని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 23,965 కార్డులలో మార్పులు చేర్పులు జరిగాయని అంటున్నారు. ఈ కార్డులకు సంబంధించి మే నెలలో 135 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా రేషన్‌షాపులకు అందాయి. వచ్చే నెలలో మరో మూడు వేల కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టి కొత్త కార్డులను వీలైనంత తొందరగా జారీ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
ప్రక్రియ కొనసాగుతోంది
జిల్లాలో కొత్త రేషన్‌కార్డులకు సంబంధించిన సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. మే నెలలో 365 కొత్త కార్డులు జారీ అయ్యాయి. వీటితో పాటు ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న మార్పులు చేర్పుల సమస్య కూడా పరిష్కారం అయింది. వచ్చే నెలలో మరో 3 వేల కొత్త కార్డులు వచ్చే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ అవుతాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– రుక్మిణి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
జిల్లాలో రేషన్‌కార్డుల వివరాలు ఇలా..
రేషన్‌షాపులు 443
ఆహార భద్రత కార్డులు 272112
అంత్యోదయ 21148
అన్నపూర్ణ కార్డులు 03
జిల్లాలో మొత్తం కార్డులు 293263
ప్రతినెల బియ్యం 5384.762 మెట్రిక్ టన్నులు

ఇంకా ఎదురుచూపులే..