భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారికి ఆదివారం పునర్వసు నక్షత్రం సందర్భంగా పట్టాభిషేకం కమనీయంగా జరిపారు. స్వామివారికి ఆదివారం సందర్భంగా అభిషేకం, సువర్ణ పుష్పార్చన గావించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి చిత్రకూట మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అనంతర పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి ఆర్జిత సేవలు, నిత్యకల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
పెద్దమ్మతల్లికి
విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
కుళాయిలో నీళ్లురాక భక్తుల ఇక్కట్లు
ఆలయానికి వచ్చిన భక్తులు తొలుత కుళాయిల వద్ద పాదాలను శుభ్రం చేసుకుని తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు. ఆదివారం కుళాయిల ద్వారా నీళ్లు రాకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. నీళ్లులేక స్నానాల గదుల వద్ద, కల్యాణకట్టవద్ద కూడా ఇక్కట్లు ఎదురయ్యాయి. నీటి సమస్యలేకుండా చర్యలు తీసుకోవాలని పలువురు ఈఓకు వినతిపత్రం అందజేశారు. విద్యుత్ సౌకర్యంలేక, జనరేటర్ పనిచేయని కారణంగా ఉదయం నీళ్లు రాలేదని, తర్వాత సమీపం నుంచి నీళ్లు తెప్పించి భక్తులకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకున్నామని ఈఓ రజనీకుమారి తెలిపారు.
కలెక్టరేట్‌లో భగీరథ మహర్షి జయంతి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్‌లో భగీరథ మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. మొదట భగీరథ చిత్రపటానికి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఇందిర పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప్పర సంఘం నాయకులు అనిశెట్టి భిక్షపతి, జి.సురేష్, జి.నవీన్, ఎ.కృష్ణ, గుంటి కుమారస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.
కిన్నెరసానిలో జలవిహారం
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్‌పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. రిజర్వాయర్‌లో జలవిహారం చేశారు. 535 మంది పర్యాటకులు కిన్నెరసానిలో ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖ రూ.29,600 ఆదాయం లభించగా, 200 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.10,400 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
రామయ్యకు పునర్వసు పట్టాభిషేకం
రామయ్యకు పునర్వసు పట్టాభిషేకం
రామయ్యకు పునర్వసు పట్టాభిషేకం