
చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్
పాల్వంచ: పట్టణంలోని నవభారత్ కాలనీలో ఉద్యోగుల క్వార్టర్లలో చోరీలు జరిగిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఒకరిని పట్టుకుని నగదు స్వాధీనం చేసుకోగా.. తాజాగా మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సతీశ్‌కుమార్ వెల్లడించారు. గత జనవరి 25వ తేదీ అర్ధరాత్రి నవభారత్‌త్ కంపెనీ ఉద్యోగుల క్వార్టర్లలో తాళాలు వేసి ఉన్న వాటిల్లోకి చొరబడిన దుండగులు నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేశారు. పోలీసులు ఘటనాస్థలంలో దొరికిన ఆధారాలతో మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్‌సంఘార్‌ను గతంలోనే అరెస్ట్ చేసి రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనిల్‌సంఘార్‌కు బెయిల్ ఇప్పించడం కోసం కొత్తగూడెం కోర్టుకు ఇద్దరు వ్యక్తులు వచ్చారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా, తండా పోలీస్ స్టేషన్ పరిధిలోని పింటు భవార్, శోభన్‌సింగ్ పోలంకిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల్లో వీరి హస్తం ఉన్నట్లు తేలిందని డీఎస్పీ చెప్పారు. వీరి నుంచి 240 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక స్మార్ట్‌ఫోన్, కీపాడ్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించామని ఆయన వివరించారు. సమావేశంలో సీఐ సతీశ్, ఎస్‌ఐలు సుమన్, ప్రవీణ్, రాఘవయ్య, జీవన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
240 గ్రాముల బంగారం స్వాధీనం