● ఉగాది నాటికి ‘భూభారతి’ ● తద్వారా సొంత శాఖలోకి తీసుకుంటారని ప్రచారం ● ఉమ్మడి జిల్లాలో 562మంది ఎదురుచూపులు
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. దీంతో మళ్లీ తాము సొంత శాఖ అయిన రెవెన్యూలోకి వెళ్తామని పూర్వ వీఆర్వోల్లో ఆశలు తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వం నవంబర్ 19, 2020న వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి 2022 జూలై 23న వీఆర్వోలను ఇతర శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో సర్దుబాటు చేసింది. ఆ సమయాన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీ లేక.. జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కలిగిన వీఆర్వోలను అటెండర్, స్వీపర్, కామాటి, కుక్, తోటమాలి, జీపు డ్రైవర్, రికార్డు కీపర్, రికార్డ్ అసిస్టెంట్, వార్డు అధికారి, సీనియర్ స్టెనో, జూనియర్ స్టెనో తదితర పోస్టుల్లో సర్దుబాటు చేశారు. అయితే, సరైన స్థాయి పోస్టులు లేక, ఆశించిన గౌరవం కూడా లభించటం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.
మళ్లీ ఇన్నాళ్లకు...
కొత్త ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొస్తామని చెబుతుండగా, పూర్వ వీఆర్వోలు ఆశలు రెకేత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11వేల పోస్టులు భర్తీ చేస్తామని చెబుతున్న క్రమంలో పూర్వ వీఆర్వోలు 5వేల మందిని ఈ పోస్టుల్లోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఫలితంగా పూర్వ వీఆర్వోలను రెవెన్యూ శాఖలోకి తీసుకోనుండగా, ఇంకొందరు నిరుద్యోగులకూ ఉద్యోగాకాశాలు దక్కే అవకాశముంది.
ఏం పేరు?
రాష్ట్రప్రభుత్వం భూభారతిలో విధులు నిర్వర్తించే వారికి గ్రామ పరిపాలన అధికారి(జీపీఏ) లేదా విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(వీఏఓ)గా పేరు పెట్టే అవకాశముందని రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసింది. ఉగాది నాటికి స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే, గ్రామస్థాయిలో వీఆర్వోలు కీలకం కానున్నందున జీపీఏనే పేరు ఖరారు చేసే అవకాశముందని చెబుతున్నారు.
ఈ సమస్యలూ పరిష్కరిస్తే...
తమను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంతో సర్వీస్ రక్షణతో పాటు పదోన్నతులు కోల్పోయామని వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇంక్రిమెంట్లు కోల్పోయామని, నేటికీ సర్వీస్ క్రమద్ధీద్దీకరణ జరగలేదని, ప్రొబేషనరీ పీరియడ్ ఖరారు చేయడం లేదనే వాదన ఉంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జీసీసీలో సేల్స్‌మెన్లుగా, పెట్రోల్ బంక్ ఆపరేటర్లుగా కేటాయించిన 16మందికి వేతనాలు అందడం లేదని చెబుతున్నారు. అంతేకాక ఇద్దరు వీఆర్వోలు మృతి చెందడంతో కారుణ్య నియామకాల్లోనూ అవకాశం ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. కాగా, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఇటీవల రెవెన్యూ అసోసియేషన్‌తో కలిసి పూర్వ వీఆర్వోలు సమావేశమయ్యారు. భూభారతిలో అవకాశం కల్పించడమే కాక ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆయనను కోరారు.
ఉమ్మడి జిల్లాలో గ్రామాలు, వీఆర్వోల వివరాలు
జిల్లా మండలాలు రెవెన్యూ వీఆర్వోలు
గ్రామాలు
ఖమ్మం 21 352 329
భద్రాద్రి 23 240 233
మొత్తం 44 592 562
సీనియారిటీతో పదోన్నతులు
రాష్ట్ర ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చి అప్పగించే ప్రతీ పనిని బాధ్యతగా చేస్తాం. అయితే, మా సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు కామన్ సీనియారిటీ ద్వారా పదోన్నతులు వర్తింపచేయాలి. ప్రతీ గ్రామానికి ఒక సహాయకుడిని నియమిస్తే క్షేత్రస్థాయిలో సులువుగా పాలన సాగుతుంది. – గరికె ఉపేంద్రరావు,
వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
వేతనాలు అందడం లేదు
వీఆర్వో వ్యవస్థ రద్దయ్యాక నన్ను గిరిజన కార్పొరేషన్ సొసైటీ(జీసీసీ)కి కేటాయించారు. ప్రభుత్వం 60శాతం, కార్పొరేషన్ 40శాతం నిధులతో వేతనం ఇవ్వాలి. కానీ సక్రమంగా వేతనాలు అందక ఇబ్బందిగా ఉంది. ఇతర శాఖల్లో మాదిరి కార్పొరేషన్‌లో పీఎఫ్, ఈఎస్‌ఐ, పెన్షన్లు సౌకర్యాలు అందడం లేదు.
– మట్టా వెంకటమ్మ, జీసీసీ ఉద్యోగి, మణుగూరు
పూర్వ వీఆర్‌ఓల్లో ఆశలు
పూర్వ వీఆర్‌ఓల్లో ఆశలు