
● జిల్లాలో జోరుగా నగదు, మద్యం పంపిణీ ● ఏజెన్సీ నియోజకవర్గాల్లోనూ రూ.కోట్లు ఖర్చు చేస్తున్న పార్టీలు ● కులాల వారీగా మందు.. విందు భోజనాలు
ఒకరిని మించి మరొకరు..
జిల్లాలోని నాలుగు రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు చెందిన ఒక్కో అభ్యర్థి రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయా స్థానాల్లో ఒక పార్టీ అభ్యర్థి ఓటుకు రూ.1000 చొప్పున ఇస్తే ప్రత్యర్థి పార్టీల వారు రూ.2 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో ఓ పార్టీ వారు ఇప్పటికే నగదు పంపిణీ ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసినట్లు సమాచారం. ఇక ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోనూ ఓటర్లకు నగదు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఎన్నికల అధికారులకు దొరక్కుండా గుట్టుగా సాగిస్తున్నారు. అయితే అక్కడక్కడా నగదు పంపిణీ విషయంలో తేడాలు ఉండడంతో గొడవలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
బూర్గంపాడు: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరతీశాయి. ఎన్నికలకు రెండురోజులు గడువు ఉండగానే డబ్బు, మద్యం పంపిణీ ప్రారంభించాయి. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు రూ.కోట్లలో నగదు పంపిణీ చేస్తున్నాయి. గ్రామాలలో ఏరియాలు, కులాల వారీగా విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం ప్రియులకు వారం రోజులకు సరిపడా మందు అందిస్తున్నారు. జిల్లాలోని ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలైన పినపాక, భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేటతో పాటు జనరల్ స్థానమైన కొత్తగూడెంలో ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు అందిస్తున్నారు. గత మూడు రోజులుగా ప్రతీ గ్రామంలోనూ మద్యం ఏరులై పారుతోంది.
కొత్తగూడెంలో పోటాపోటీ..
కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్‌గా జలగం వెంకట్రావు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురూ ఓటర్లకు హామీలతో పాటు భారీగా తాయిలాలు అందిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ ఎన్నికలను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇక్కడ ఒక్కో ఓటుకు రూ. 2 వేల నుంచి రూ. 4వేల వరకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నగదుతో పాటు కొన్నిచోట్ల మహిళలకు చీరెలు, వెండి వస్తువులు కూడా అందిస్తున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment