రాజ్యాంగంపై దాడి జరుగుతోంది..

మధిరలో మాట్లాడుతున్న వీరభద్రం, పక్కన జెడ్పీ చైర్మన్‌ కమల్‌రాజ్‌ తదితరులు  - Sakshi

● కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్యేలను బెదిరిస్తుండడం గర్హనీయం ● జనచైతన్య యాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం

వైరా/మధిర/బోనకల్‌: దేశంలో బీజేపీ అరాచకాలను అరికట్టేందుకు కలిసొచ్చే పార్టీలతో ప్రయాణం చేస్తామని, రాజ్యాంగంపై ఆ పార్టీ చేస్తున్న దాడులను అడ్డుకుంటామని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన జన చైతన్య యాత్ర ఆరో రోజైన బుధవారం జిల్లాలోని వైరా, మధిర, బోనకల్‌ మండలం రావినూతల గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో తమ్మినేని మాట్లాడుతూ దేశంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఒకే దేశం, ఒకే భాష, ఒకే ఎన్నిక అంటూ ప్రశ్నించే వారిపై బీజేపీ ప్రభుత్వం దాడులకు పాల్పడుతుందని విమర్శించారు. రాజ్యాంగాలను మార్చాలని చూస్తున్న ఆ పార్టీ నేతలు.. తొలుత హిందువుల్లో 52 శాతం బీసీ కులాల లెక్క తేల్చి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాగా, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్యేలను కేసుల పేరుతో కేంద్రం బెదిరిస్తోందని వీరభద్రం తెలిపారు. ఈక్రమంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఇదే సమయాన సీఎం కేసీఆర్‌ ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలు చేస్తాయని తమ్మినేని స్పష్టం చేశారు. పేదల ఇళ్ల నిర్మాణానికి పెద్ద సార్‌ రూ.11 లక్షలు, చిన్న సార్‌ రూ.5లక్షలు ప్రకటించాలని ప్రధాని, సీఎంను ఉద్దేశించి ఆయన డిమాండ్‌ చేశారు. ఇక ఉమ్మడి జిల్లాలో ఓ నేత జంక్షన్‌లో ఉన్నప్పటికీ బీజేపీ పార్టీలో చేరి జిల్లా ప్రజలకు నష్టం చేయొద్దని హితవు పలికారు. కాగా, నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, ఒక్కొక్కకరికి అకౌంట్‌లో రూ.15 వేలు వేస్తామని, అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోదీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు సీపీఎం, సీపీఐ పార్టీలు సీఎం కేసీఆర్‌ వెంటే నడుస్తాయనని.. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పెను ప్రమాదమని.. అందుకే బీఆర్‌ఎస్‌తో కలిసి బీజేపీని గెలుపును అడ్డుకుంటామని చెప్పారు. ఒకే దేశం, ఒకే మతం అంటున్న మోడీ, షాలు ఒకే కులం అని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి తాబేదారుగా ఈడీ పనిచేస్తుందని వీరభద్రం విమర్శించారు.

పలువురి సంఘీభావం

సీపీఎం ఆధ్వర్యాన చేపట్టిన జన చైతన్య యాత్రకు బీఆర్‌ఎస్‌, సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈమేరకు వైరాలో వీరభద్రంను కలిసిన ఎమ్మెల్యే రాములునాయక్‌ మాట్లాడుతూ తమ కుటుంబం కూడా కమ్యూనిస్టు కుటుంబమేనని.. అందరం కలిసి దుష్ట బీజేపీపై పోరాడి హిందూ మహాసముద్రంలో కలపాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌, తెలంగాణపై మోదీ కక్షకట్టినా.. ఆయనకు ఎవరూ లొంగరని తెలిపారు. ఇక మధిరలో యాత్రకు జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈయాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, సీఐటీయూ రాష్ట్ర నాయకుడు మందడపు సాయిబాబా, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, మధిర మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్లు మొండితోక లత, శీలం విద్యాలతతో పాటు సీపీఎం, బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు భూక్యా వీరభద్రం, సుంకర సుధాకర్‌, తోట నాగేశ్వరరావు, మల్లు లక్ష్మి, బొంతు సమత, చెరుకుమల్లి కుటుంబరావు, యర్రా బాబు, యమాల గోపాలరావు, ముళ్లపాటి సీతరాములు, మల్లు లక్ష్మి, కల్యాణపు వెంకటేశ్వరరావు, మందడపు రాణి, బెజవాడ రవిబాబు, శీలం నర్సింహారావు, చిత్తారి నాగేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, మందా సైదులు, పొన్నం వెంకటేశ్వరావు, చింతలచెర్వు కోటేశ్వరావు, బండి రమేష్‌, దొండపాటి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Bhadradri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top