అరకు కాఫీ విక్రయాల్లో జిల్లాకు ప్రథమస్థానం..
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
బాపట్ల: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ క్లినిక్‌ను నిర్వహించి వివిధ రకాల భూ సంబంధిత సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అర్జీదారులతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను విన్నారు. భూ వివాదాలు, పట్టాదారు పాస్‌బుక్‌లు, భూ సరిహద్దు సమస్యలు, రీసర్వే, భూ రికార్డుల సవరణ, వారసత్వ మార్పులు, ఆక్రమణలు, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై వచ్చిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు తమ భూ సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావు లేకుండా సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత ఫిర్యాదులను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ శాఖ అధికారులు, పర్యవేక్షకులు షఫి, శ్రీలక్ష్మి, సతీష్ తదితరులు ఉన్నారు.
టెక్స్‌టైల్ కేంద్రాన్ని వినియోగంలోకి..
చీరాల టౌన్: లక్షలు వెచ్చించి గొప్ప లక్ష్యంతో నిర్మాణం చేపట్టిన కామన్ ఫెసిలిసీ సెంటర్ (హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ శిక్షణ కేంద్రం)ను వినియోగించకుండా మూసివేయడం మంచిదికాదని.. త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని ఈపురుపాలెం గ్రామంలో నిర్మాణం చేసి ఖాళీగా వదలిన కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీలోని గ్రామ చావిడి భవనాన్ని పరిశీలిచారు. కలెక్టర్ వెంట డీఎస్ జగన్మోహనరావు, మున్పిపల్ కమిషనర్ డానియేల్ జోసఫ్, సీఎస్‌డీటీ ఓంకార్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
బాపట్ల: అరకు కాఫీ విక్రయాలలో బాపట్ల జిల్లా డ్వాక్రా మహిళలు రాష్ట్రంలోనే ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. చీరాల, మార్టూరు మండలాల్లో అరకు కాఫీ విక్రయాలు చేస్తున్న డ్వాక్రా మహిళలు రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికవడంపై జిల్లా కలెక్టర్ సోమవారం ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆ మహిళలకు కలెక్టరేట్‌లో అవార్డు, నగదు బహుమతులను కలెక్టర్ అందజేశారు. జిల్లా ప్రజలను ఆకర్షించేలా అరకు కాఫీ తయారు చేయడం, విక్రయించడంలోనూ డ్వాక్రా మహిళలు మంచి సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. చీరాల వాడరేవుకు చెందిన అర్జీ శాంతి గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన అరకు కాఫీ విక్రయశాలను వాడరేవులో ప్రారంభించారని, కేవలం 10 నెలల్లోనే రూ.12,83,227లు విక్రయాలు చేపట్టారన్నారు. శాంతి రాష్ట్రస్థాయిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు, రూ.5 వేల నగదుతో ప్రభుత్వం సత్కరించిందన్నారు. మార్టూరు మండలానికి చెందిన షేక్ షాజియాభాను గడచిన 10 నెలల్లో అరకు కాఫీ రూ. 22,43,178 లు విక్రయాలు జరిపారన్నారు. దీనికిగాను ‘టాప్ పెర్ఫార్మర్ అవార్డు’, రూ.3 వేల నగదు బహుమతితో రాష్ట్ర ప్రభుత్వం అవార్డుతో సత్కరించిందన్నారు. జిల్లా జేసీ భావన వశిష్ఠ, డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్, డీఆర్డీఏ పీడీ బి.సింగయ్య, జిల్లా అధికారులు, వెలుగు డీపీఎం రవీంద్ర, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.


