పోలీసులకు ఎస్పీ క్లాస్!
భర్త వేధింపులపై మార్టూరు పోలీసులకు దివ్యాంగ మహిళ ఫిర్యాదు పట్టించుకోని పోలీసులు పోలీసు గ్రీవెన్స్‌లో తల్లిదండ్రులతో కలిసి ఎస్పీని కలిసిన మహిళ
మార్టూరు: స్థానిక పోలీస్ స్టేషన్ తమకు న్యాయం జరగలేదని విచారించి న్యాయం చేయాలని మార్టూరుకు చెందిన ఓ కుటుంబం సోమవారం బాపట్ల ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌లో అభ్యర్థించింది. బాధితుల వివరాల మేరకు.. మైనార్టీ వర్గానికి చెందిన ఓ వ్యక్తికి పుట్టుకతో మూగ, చెముడు వైకల్యం కలిగిన కుమార్తె ఉంది. ఇంకొల్లు మండలం గంగవరం గ్రామానికి చెందిన నిరుపేద యువకుడికి 16 ఏళ్ల క్రితం తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. వివాహం జరిపించిన వ్యక్తి వారికి మార్టూరులోనే కాపురం పెట్టించి వారి ప్రతి అవసరాన్ని తనే చూసుకుంటూ వస్తున్నాడు. ఈ జంటకు 14, 15 సంవత్సరాల వయసుగల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే దివ్యాంగురాలైన ఆ యువతి భర్త గతకొంత కాలంగా మరొక మహిళతో సహజీవనం చేస్తూ భార్యను శారీరకంగా, మానసికంగా హింసించసాగాడు. ఈనెల 12వ తేదీ దివ్యాంగురాలైన భార్యకు బలవంతంగా నిద్రమాత్రలు మింగించాడు. తాను సహజీవనం చేస్తున్న యువతిని వివాహం చేసుకోవడానికి మోపిదేవి వెళుతున్నాను.. నీవు అడ్డు తొలగితే మాకు ఇబ్బంది ఉండదంటూ స్వయంగా భార్యకు చెప్పి ఆ రాత్రి యువతితో కలిసి మోపిదేవి వెళ్లాడు. ఈ క్రమంలో యువతి తాలూకు కుటుంబం జూలై 14న మార్టూరు పోలీస్ స్టేషన్‌లో తన కుమార్తైపె హత్యాయత్నానికి పాల్పడిన అల్లుడిపై చర్యలు తీసుకొని తమ కుమార్తె, ఆమె పిల్లలకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.
బాధిత కుటుంబంపై నిందితుడి దాడి
ఇదిలా ఉండగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి మార్టూరు చేరిన బాధిత యువతి తండ్రి, ఆమె సోదరుడిపై దాడి చేశారు. స్థానిక కూరగాయల మార్కెట్ ఎదురుగా రాత్రి 7 గంటల ప్రాంతంలో నిలబడి ఉండగా నిందితుడైన ఆమె భర్త నాపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తారా? మీ అంతు చూస్తానంటూ అంటూ ఇద్దరిపై దాడికి తెగబడ్డాడు. దాడిలో గాయపడిన తండ్రీకొడుకులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బాధిత కుటుంబం స్టేషన్‌లో ఫిర్యాదు చేసి 13 రోజులు గడిచినా తమకు స్థానిక పోలీసులు ఎలాంటి న్యాయం చేయకపోవడంతో ఆ కుటుంబం సోమవారం గ్రీవెన్స్‌లో జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్‌కు ఫిర్యాదు చేసింది. దివ్యాంగ యువతి పరిస్థితిని చూసి చలించిపోయిన ఎస్పీ సావధానంగా విషయం తెలుసుకున్నారు. అనంతరం మార్టూరు పోలీసు అధికారులను తీవ్రంగా మందలిస్తూ.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదుపై సక్రమంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ స్థానిక అధికారులను ఆదేశించినట్లు బాధిత కుటుంబం తెలిపింది.


