ప్రత్తిపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ముట్లూరు పంచాయితీ దాడి చేసిన టీడీపీ ప్రజాప్రతినిధిపై రౌడీషీట్ ఓపెన్‌కు జనసేన పట్టు ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు
చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ముట్లూరులో కాపులపై దాడి వివాదం రోజురోజుకీ ముదిరి పాకానపడుతోంది. జనసేన శ్రేణులు వివాదాన్ని సీరియస్‌గా తీసుకుని పావులు కదుపుతున్నాయి. న్యాయం జరగని పక్షంలో అవసరమైతే అధినాయకత్వంతో అయినా అమీతుమీ తేల్చుకునేందుకు వారు సిద్ధమవుతున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి వివాదం చినికి చినికి గాలి వానలా మారి ఆ సెగ ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాల వరకు చేరింది. ఒక దశలో ప్రజాప్రతినిధులు కూడా వారి పక్షాన నిలవకపోవడంతో ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నిరసన గళం వినిపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దారుణంగా దాడి..
ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో ఈ నెల 11వ తేదీన రాత్రి పదకొండు గంటల సమయంలో ఓ టీడీపీ కార్యకర్త తన బైక్‌పై ఇంటకి వెళుతున్న సమయంలో అదే మార్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఒకే బైక్‌పై ఎదురుగా వచ్చారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొనడంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. వివాదం పెద్దది కావడంతో టీడీపీ కార్యకర్త గ్రామంలోని టీడీపీ ఎంపీటీసీకి ఫోన్ చేయడం, ఆయన మరికొంత మందితో కలిసి వచ్చి ముట్లూరు–కోవెలమూడి మధ్య నల్లకుంట ప్రాంతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు యువకులపై విచక్షణారహితంగా దాడి చేయడం, అంతటితో ఆగకుండా రోడ్డుపై కొట్టుకుంటూ గ్రామంలోనికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు టీడీపీ ఎంపీటీసీపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని కాపు సంఘ నాయకులు గొడవ జరిగిన రోజు నుంచి పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఓ సారి ఎంపీ వద్ద పంచాయితీ కూడా పెట్టారు. ఘటన జరిగి దాదాపుగా పదిహేను రోజులు గడుస్తున్నా సదరు ఎంపీటీసీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జనసేన నాయకులు, కాపు నేతలు, కాపు సామాజిక వర్గం రగిలిపోతోంది.
ఎమ్మెల్యేకు నిరసన సెగ
అటో ఇటో తేల్చుకునేందుకు మంగళవారం ముట్లూరు కాపు సామాజిక వర్గం యువకులు, నేతలు భారీ సంఖ్యలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కార్యాలయానికి వెళ్లారు. కాపు యువకులపై విచక్షణరహితంగా దాడికి పాల్పడిన టీడీపీ ఎంపీటీసీపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎదుట కాపు సామాజిక వర్గ బాధితులు తీవ్ర ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఎమ్మెల్యే నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆగ్రహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన ఎదుటే ‘బూర్ల రామాంజనేయులు డౌన్ డౌన్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అమీ తుమీ తేల్చుకుంటామని అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం.
అనంతరం ముట్లూరు కాపు నేతలు ఎంపీ పెమ్మసాని కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కూడా టీడీపీ ఎంపీటీసీపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని పట్టుబట్టారు. అయితే గొడవ జరిగిన రెండు రోజుల తరువాత ఇదే నాయకులు, కాపు సామాజిక వర్గ పెద్దలు ఎంపీ వద్దకు వెళ్లినప్పుడు తానున్నానని హామీ ఇచ్చిన ఎంపీ.. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ సినిమా స్టైల్ మాటలు చెప్పినట్లు జనసేన నేతలు, కాపు నాయకులు వాపోతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల తీరు పట్ల వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాపు యువకులపై అన్యాయంగా విచక్షణరహితంగా దాడికి పాల్పడిన టీడీపీ ఎంపీటీసీపై రౌడీషీట్ ఓపెన్ చెయ్యకపోతే అధినాయకత్వం వరకు వెళ్లి అటో ఇటో తేల్చుకునేందుకు సిద్ధమని చెబుతున్నారు.


