దాచేపల్లి: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రజకుల సమస్యలపై పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని రజక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక విజయభాస్కర్ కల్యాణ మండపంలో రాష్ట్రస్థాయిలో రజకుల రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ రజక సమాఖ్య సంక్షేమ సంఘం మాజీ ఉపాధ్యక్షుడు అక్కినపల్లి బాలయ్య అధ్యక్షత వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రజకుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రజకులు రాజ్యాధికారం కోసం... ఆర్థిక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రవాప్తంగా 36 లక్షల మందికి పైగా రజక జనాభా ఉందని, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని బాలయ్య డిమాండ్ చేశారు. అంటు బట్టల దగ్గరనుంచి శరీరంపై ఉన్న అన్ని బట్టలను శుభ్రం చేసేది రజకులని, వారిని సైతం గ్రామాల్లో అంటరానివారిగానే చూస్తారని, మరి ఎస్సీ జాబితాలో ఎందుకు చేర్చరన్నారు. ఎస్సీ హోదానే ఏక లక్ష్యంగా రజకులందరు ఐక్య పోరాటాలు చేయాలనన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేసే ప్రతీ ఆందోళన కేంద్రప్రభుత్వం దృష్టికి వెళుతుందని తెలిపారు. ఇప్పటికే తాము చేసిన ఆందోళనలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయన్నారు. రానున్న రోజుల్లో అమరావతిలో లక్ష మందితో సభ నిర్వహించాలన్న ఆలోచన ఉందని బాలయ్య అన్నారు. ఈ సమావేశంలో రజక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పొత్తూరు షణ్ముఖం, రజక చైతన్య సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాకినాడ రామారావు,రాజమండ్రి నారాయణ, పోకల వెంకటేశ్వర్లు, గంధం అప్పాజి, లాయర్లు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, మాస్టర్ లక్ష్మీనారాయణ, విజయలక్ష్మి, కల్లేపల్లి శైలజ, పొదిలి శ్రీనావాసరావు, భగత్, టి.భాస్కర్, సిహెచ్ రామకోటేశ్వరరావు. కె.సత్యనారాయణ, కోయ రామారావు, పిడుగురాళ్ళ సురేష్ తదితరులు పాల్గొన్నారు.


