వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మదన్‌మోహన్‌గౌడ్
రేపల్లె: మామిళ్లపల్లి గ్రామ మొక్క జొన్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న బీసీ గౌడ సామాజానికి చెందిన వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా మోహన్‌కృష్ణపై పొన్నూరు సీఐ దాడి చేయటం బాధాకరమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ మదన్‌మోహన్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. బీసీ గౌడ సమాజానికి చెందిన నాయకులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా మామిళ్లపల్లిలో గిట్టుబాటు ధర కోసం ప్రశ్నించిన రైతులపై దాడులు చేయటమేగాక అక్రమ కేసులుపెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు సంఘీభావంగా వచ్చిన మాజీ మంత్రి జోగి రమేష్, రేపల్లె సమన్వయకర్త నాగమోహన్‌కృష్ణలపై ఉద్దేశపూర్వకంగా పోలీసులు దాడికి తెగబడ్డారన్నారు. సీఎం చంద్రబాబు, లోకేష్‌ల డైరెక్షన్‌లో రాష్ట్రవ్యాప్తంగా గౌడ సామాజికవర్గ నాయకులపై పోలీసులు, టీడీపీ నాయకులు దాడికి తెగబడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తున్న చంద్రబాబు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బొర్రా శ్రీనివాసరావు, పట్టణ, మండల కన్వీనర్‌లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, జిల్లా అధికార ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిమటా బాలాజీ, మహిళా నాయకులు వీసం నాగలక్ష్మి, పద్మావతి పాల్గొన్నారు.


