చినగంజాం: వాన్‌పిక్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రైతుల నుంచి తీసుకున్న భూములు తిరిగి ఇచ్చేంతవరకు తాము పోరాదాం అని మండలంలోని తీరప్రాంత గ్రామాల ప్రజలు తీర్మానించారు. ఆదివారం మండలంలోని మోటుపల్లి పంచాయతీ రుద్రమాంబపురం రామాలయం ఆవరణలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నేతృత్వంలో మండలంలోని 13 తీరప్రాంత గ్రామాల కాపులు, పెద్దలు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వాన్‌పిక్ ప్రాజెక్ట్ ఏర్పాటు కాని దృష్ట్యా స్థానికంగా రైతుల వద్ద నుంచి తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. మూడు దశలలో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ముందుగా రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులను కలిసి సమస్యను వివరించడం, తరువాత న్యాయపరమైన పోరాటం చేయటం, మూడోదశలో పోరాటాన్ని ఉధృతం చేసి నిరసనలు, ధర్నాలు చేపట్టడం వంటి చర్యలతో ముందుకు సాగుదామన్నారు. కార్యక్రమంలో పండ్రాజు శంకరరావు, కొండూరి గోవింద్ పాల్గొన్నారు.


