ఏం చేయగలవు... పోలీసు! | - | Sakshi
Sakshi News home page

ఏం చేయగలవు... పోలీసు!

May 25 2026 1:40 AM | Updated on May 25 2026 1:40 AM

ఏం చేయగలవు... పోలీసు! కొల్లూరు: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ముందు తమను తాము కాపాడుకుంటే చాలన్న పరిస్థితులకు రావడానికి వారి స్వయంకృతాపరాధమే కారణమన్న భావన ప్రజలలో ఉంది. ఒక ఎమ్మెల్యే ముందే బాహాబాహీకి దిగి కొట్లాడుకున్న టీడీపీ నాయకులు, వారి అనుచరులు ఆ ఘర్షణలో నేరుగా పోలీసులపై దాడి చేసినా పట్టించుకోకపోవడమే దీనికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. నేడు పోలీసులను వెంటాడి పోలీసు స్టేషన్‌ మీద దాడి చేసేవరకు అది వచ్చిందన్న అభిప్రాయం ప్రజలలో బలంగా ఉంది. టీడీపీ నాయకుల వత్తాసు, అండదండలు చూసుకొని కొందరు వ్యక్తులు సాగిస్తున్న అరాచకాలను చూసీచూడనట్లుగా పోలీసులు నటించారు. వారికి సేవ చేయడం ఫలితంగానే పోలీసు వ్యవస్థ పనితీరు నీరుగారిపోయిందనే విమర్శలు ఉన్నాయి. రౌడీమూకలు ఇక పోలీసులు, సాధారణ ప్రజలు అనే తేడా లేకుండా దాడులకు దిగే దుస్థితి దాపురించిందని ఆరోపణలు వస్తున్నాయి. అల్లర్లు చేస్తూ భయానక వాతావరణం సృష్టించడం ఒకవిధంగా పోలీసు వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోంది. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పోలీసుల వైఫల్యాన్ని అసరాగా తీసుకుంటున్న కొన్ని అసాంఘిక శక్తులు చివరకు బరితెగించి పోలీసులపైనే దాడులకు తెగబడే పరిస్థితి దాపురించింది. కొల్లూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇసుక అక్రమార్కుల నుంచి రాజకీయ అండదండలున్న రౌడీ మూకలు పలుమార్లు పోలీసులు, సాధారణ ప్రజలపై బాహాటంగా దౌర్జన్యాలకు దిగినా అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపారు. అరాచక శక్తులు పేట్రేగి పోవడానికి ఇది ప్రధాన కారణమన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా చట్టాన్ని, సమాజాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు ఇలా రాజకీయ నాయకుల చెప్పుచేతల్లో నలిగిపోతుండటంతో అరాచకశక్తులు రెచ్చిపోతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం పరిపాటిగా మారింది. మైనర్‌ బాలల నుంచి నడి వయస్సు వ్యక్తుల వరకు మద్యం, గంజాయి వంటి మాదకద్రవ్యాల మత్తులో మారణాయుధాలు చేతబూని ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ స్వైర విహారం చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొల్లూరు టీడీపీలో ఉన్న రెండు వర్గాలకు చెందిన నాయకులు, అనుచరులు ఏకంగా పోలీసు స్టేషన్‌లోనే ప్రత్యర్థులపై దాడులు చేయడం, పోలీసులపైనా విరుచుకుపడుతుండటం నిత్యకృత్యంగా మారింది. ● ఆరు నెలల క్రితం కొల్లూరు బస్టాండ్‌ సెంటర్లో జరిగిన సభలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ముందే టీడీపీకి చెందిన ఇరు వర్గాలు తీవ్రస్థాయిలో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ సంఘటనలో అప్పటి ఎస్‌ఐ అమరవర్ధన్‌పై అసభ్యపదాలతో ఓ వర్గం టీడీపీ నాయకుడు విరుచుకుపడ్డాడు. అతడి అనుచరులు ఓ హెడ్‌ కానిస్టేబుల్‌, మరో కానిస్టేబుల్‌పై దాడి చేసి గాయపరిచారు. పోలీసులపై దాడి జరిగి ఆరు నెలలు గడిచినా నేటికీ చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ● రెండు నెలలు క్రితం మండలంలోని దోనేపూడిలో జరిగిన లక్ష్మీతిరుపతమ్మ తిరునాళ్ల సందర్భంగా ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ అడ్డగోలుగా నడుపుతుండటంతో పోలీసులు కొల్లూరు పోలీసు స్టేషన్‌కు వాహనాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చిన టీడీపీ నాయకుడు పోలీసులపై తిరునాళ్లలోనే ప్రజలందరి ముందు విరుచుకుపడి తన ప్రతాపం ప్రదర్శించాడు. అప్పటికీ శాంతించని అతను అర్ధరాత్రి సమయంలో తన అనుచరులతో కొల్లూరు స్టేషన్‌కు చేరుకొని పోలీసులను అసభ్య పదాలతో అవమానించాడు. నిమిషాల్లో బదిలీ చేయిస్తానని హెచ్చరించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ● కొల్లూరు పోలీసు స్టేషన్‌లో టీడీపీలోని ఓ వర్గం నాయకుడు తనకు అర్ధరాత్రి క్రాపకు చెందిన వ్యక్తి ఫోన్‌ చేసి అగౌరవంగా మాట్లాడుతున్నాడంటూ నెల రోజుల క్రితం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాడు. అతనిని ఎస్‌ఐ కోటేశ్వరరావు స్టేషన్‌కు పిలిపించిన క్రమంలో ఆ నాయకుడి అనుచరులు పోలీసు స్టేషన్‌లోనే అతనిపై దాడికి పాల్పడి దౌర్జన్యకాండ కొనసాగించారు. పోలీసులు నోరు మెదపకుండా మిన్నకుండిపోయారు. ● స్థల వివాదంలో సైతం టీడీపీకి చెందిన నాయకుడి అనుచరులు ఓ వ్యక్తిపై పోలీసు స్టేషన్‌లోనే కుర్చీతో కొట్టిన సంఘటనలోనూ పోలీసులు కళ్లు మూసుకొని నిద్ర నటించారు. టీడీపీ మూకలకు పోలీసు స్టేషన్‌లో దాడులు పరిపాటిగా మారిపోయాయి. ● ఇటీవలి కొల్లూరు బైపాస్‌ రోడ్డులో ఓ గేదెల ఫామ్‌ వద్ద సైతం ఫామ్‌లో పనిచేసే అంతర రాష్ట్ర కూలీలకు, స్థానికంగా ఉండే యువకులకు మాటామాటా పెరిగి పదుల సంఖ్యలో స్థానిక వ్యక్తులు అక్కడకు చేరుకొని ఘర్షణకు దిగారు. పోలీసులు కూలీలకు పారిపోవాలని సలహా ఇచ్చి ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. స్థానికులపై చర్యలు తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి.

ఇవిగో నిదర్శనలు

సర్వసాధారణంగా మారిన దాడులు

రక్షకభటులపై స్టేషనులోనే

టీడీపీ నేతల దాడులు

రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో

నీరుగారుతున్న పోలీసు వ్యవస్థ

టీడీపీ నేతల అండతో దర్జాగా

తిరుగుతున్న అరాచక శక్తులు

పోలీసులపై గతంలో దాడులు

చేసినా చర్యలు శూన్యం

స్టేషన్‌లోనే ప్రత్యర్థులపై యథేచ్ఛగా

తమ్ముళ్ల ముష్టిఘాతాలు

మాట వినని పోలీసులపై

టీడీపీ నాయకుల తిట్ల దండకాలు

ప్రజారక్షణ సంగతేమోగానీ..

స్వీయ రక్షణ కూడా చేతగాని ఖాకీలు

చట్టాలను చుట్టాలుగా మార్చుకొని టీడీపీ నాయకులు చూపుతున్న పచ్చ పాత ధోరణి చివరకు పోలీసులనే చేతులు ముడుచుకొని కూర్చునేలా చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో అమలవుతున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగం ఫలితంగా తమను తాము కాపాడుకోలేని పరిస్థితికి పోలీసులు దిగజారిపోయారన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. కొల్లూరు పోలీసు స్టేషన్‌పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన దాడి ఘటన దీనికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement