మహిళా కోచ్ అవసరం
జాతీయ స్థాయిలో ఆడటమే లక్ష్యం
గుంటూరు వెస్ట్ (క్రీడలు) : ఒకప్పుడు క్రికెట్ అంటే కుర్రాళ్లే ఉత్సాహంగా ఆడేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బాలికలు, యువతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. మహిళా క్రికెట్‌లో రాణించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వసతులను సద్వినియోగం చేసుకుని సత్తా చాటాలని శ్రమిస్తున్నారు.
అప్పట్లోనే సకల వసతులు
గతంలో జాతీయ మహిళా క్రికెట్ అకాడమీ గుంటూరులోని జేకేసీ కళాశాల క్రీడా మైదానంలో ఉండేది. ఇక్కడ ఆటతోపాటు అత్యాధునిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉండేవి. అప్పట్లో జాగర్లమూడి నరేంద్రనాథ్ వంటి కొందరు మహిళా క్రికెట్ అకాడమీని ఇక్కడకు తీసుకు రావడానికి తీవ్ర కృషి చేశారు. క్రికెట్‌కు సేవలందించారు. ఆయన మరణంతో మహిళా క్రికెట్ అకాడమీ ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి తరలిపోయింది. జిల్లాలో క్రికెట్ ఆడే యువతుల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఒకానొక దశలో అన్ని ఫార్మెట్లలో కలిపి 15 మంది కూడా ఉండేవారు కాదంటే నమ్మాల్సిందే. గత ఏడాది భారత మహిళా క్రికెట్ జట్టు అనూహ్య రీతిలో ప్రపంచ మహిళా క్రికెట్ కప్ అందుకుంది. దీంతో మన దేశంలో యువతుల్లో క్రికెట్‌పై జోష్ పెరిగింది.
పెరిగిన క్రీడాకారుల సంఖ్య
ప్రస్తుతం జిల్లాలో అన్ని విభాగాల్లోనూ కలిపి క్రికెట్ ఆడే వారు దాదాపు 100 మంది ఉన్నారు. ఇందులో కొందరు రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారు. ఆదివారం స్థానిక అరండల్‌పేటలోని జీడీసీఏ సారథ్యంలో త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సెలక్షన్స్‌లో సుమారు 70 మంది హాజరయ్యారు. దీనికి తోడు రంజీ మాజీ క్రీడాకారులు సరస్వతి రెడ్డి, శరత్‌తోపాటు సీనియర్ కోచ్ ఇండ్ల భాస్కర్‌లు శిక్షణ, అనుభవం కలిగిన మాజీ క్రికెటర్లు త్రీమెన్ కమిటీలో ఉండడం మహిళా క్రికెట్‌లో జోష్ పెంచుతోంది. త్వరలో ఇక్కడకు మహిళా కోచ్ కూడా రానున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ శిక్షణ, జిమ్, ఆస్ట్రో టర్ఫ్ వికెట్‌లాంటి ఎన్నో సదుపాయాలు ఇక్కడ కల్పించారు.
అదరగొడుతున్న మహిళా క్రికెటర్లు
అవకాశాలు కల్పిసున్న ఏసీఏ
జిల్లాలో వందమందికిపైగా క్రికెటర్లు
జాతీయ జట్టులో స్థానమే లక్ష్యం
త్వరలో మహిళా క్రికెట్ కోచ్
నియామకం
ప్రస్తుతం జిల్లా స్థాయిలో ఇక్కడ క్రికెట్ అంతా బాగుంది. మాలాంటి వారికి మహిళా క్రికెట్ కోచ్ ఉంటే మరింత బాగుంటుంది. త్వరలోనే ఆ లోటు తీరుతుందని భావిస్తున్నాను. అండర్–19, 23 స్టేట్ ఆడాను. గత ఏడాది చేసిన రెండు సెంచరీలు నాలో ఆత్మ విశ్వాసం పెంచాయి. ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను.
– ఎం.హాసినీ చౌదరి, గుంటూరు
నేను దాదాపు 9 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నా. ఒక పక్క చదువుతోపాటు క్రికెట్ సాధన చేస్తున్నా. ఈ క్రమంలో అండర్–16, 19, 23 స్టేట్‌తోపాటు సీనియర్ విభాగంలోనూ రాణిస్తున్నా. 2021లో జోనల్స్‌లో 5 వికెట్లు తీయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆల్‌రౌండర్‌గా రాణించాలని , జాతీయస్థాయిలో ఆడాలనేదే లక్ష్యం.
– ఎస్.లక్ష్మీ ప్రసర్తి, గుంటూరు


