జిల్లా ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడిగా క్రాంతికుమార్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడిగా క్రాంతికుమార్‌

May 25 2026 1:40 AM | Updated on May 25 2026 1:40 AM

జిల్లా ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడిగా క్రాంతికుమార్‌ ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం గుణదల కొండకు పోటెత్తిన భక్త జనం జామాయిల్‌ తోట దహనం

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): గుంటూరు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కుమ్మర క్రాంతికుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక హోటల్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ నుంచి గుంజి రమేష్‌బాబు, అబ్జర్వర్‌గా చక్రవర్తి, జిల్లా ఒలింపిక్‌ అబ్జర్వర్లు ఎన్నికలను పర్యవేక్షించి ఫలితాలను ధ్రువీకరించారు. నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా ఎ. వెంకట చంద్రశేఖర్‌రావు, టి.శ్రీనివాసరావు, అంజలిదేవి, కోశాధికారిగా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా దుర్గామోహన్‌, మానస, బ్రహ్మేష్‌, వి.రాజేష్‌, జె. రాజేష్‌, జి.ప్రసన్న కుమార్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి ఇద్దరు మహిళలను కార్యవర్గంలోకి తీసుకున్నామని క్రాంతికుమార్‌ తెలిపారు.

తెనాలిరూరల్‌: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తెనాలి ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ07జడ్‌0261 నంబరు గల బస్సు ఆదివారం సాయంత్రం కొల్లపర మండలం వల్లభాపురం నుంచి తెనాలి వస్తుండగా తెనాలి– విజయవాడ రహదారిలో కంచర్లపాలెం వంతెన వద్ద లారీ వేగంగా ఎదురుగా వచ్చింది. దీంతో డ్రైవరు బస్సును ఎడమ వైపును లాగాల్సి వచ్చింది. అప్పటికే వర్షం కురిసి ఉండడంతో రోడ్డు మార్జిన్‌లో తూర్పు కాల్వ గట్టుపై మట్టిలో ఇరుక్కుపోయింది. ఇంకొంచెం వెళ్లి ఉంటే బస్సు కాల్వలో పడి పెను ప్రమాదం జరిగి ఉండేది. బస్సును పొక్లెయిన్‌తో లాగాల్సి వచ్చింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

గుణదల(విజయవాడ తూర్పు): వేసవి సెలవుల నేపథ్యంలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తజనం పోటెత్తారు. ఓ వైపు భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా 43 డిగ్రీల ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా యాత్రికులు తమ భక్తి ప్రపత్తులను చాటుతున్నారు. క్రైస్తవ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి యాత్రికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. మరియమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. కాలినడకన కొండ శిఖరాగ్రానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

పెదకూరపాడు: చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. గుర్తు తెలియని దుండగులు పంటకు నిప్పు పెట్టినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మండలంలోని రామాపురం – అత్తలూరు గ్రామాల మధ్య కొత్తలూరు గ్రామానికి చెందిన పుట్టి ఆంజనేయులు ఐదు ఎకరాలలో జామాయిల్‌ తోటలో సాగు చేశాడు. కర్ర కొట్టించేందుకు బేరం కూడా కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు పంటకు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement