తెనాలిలో భారీ వర్షం | - | Sakshi
Sakshi News home page

తెనాలిలో భారీ వర్షం

May 25 2026 1:40 AM | Updated on May 25 2026 1:40 AM

గుంటూరు నగరంలో చిరుజల్లులతో

కూడిన వర్షం

వణికించిన ఈదురు గాలులు

పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు

అంతరాయం

తెనాలిరూరల్‌: తెనాలిలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొద్ది రోజులుగా రికార్డు స్థాయి ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం చల్లటి ఊరటనిచ్చింది. వర్షం ధాటికి పలుచోట్ల రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం కలిగింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వీధి వ్యాపారులు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్‌ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు పేలాయి. అనేక చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

గుంటూరులో...

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు నగరాన్ని ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా మారిన వాతావరణం అతలాకుతలం చేసింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులతోపాటు చిరుజల్లులతో కూడిన వర్షం నగరవాసులను ఆందోళనకు గురిచేసింది. ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకుని ఈదురుగాలులు బలంగా వీయడంతో రోడ్లపై దుమ్ము రేగింది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు గంటపాటు చిరుజల్లులు కురిశాయి. ఈదురు గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అరండల్‌పేట, బ్రాడీపేట, పట్టాభిపురం, ఏటీ అగ్రహారం, బృందావన్‌ గార్డెన్స్‌, కొరిటెపాడు, అమరావతి రోడ్‌, కొత్తపేట, నల్లచెరువు, ఆర్‌టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో గంటకుపైగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చెట్ల కొమ్మలు విద్యుత్‌ తీగలపై పడటంతో ఫీడర్లు ట్రిప్‌ అయ్యాయని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులు చేపట్టి దశలవారీగా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. అరండల్‌పేటలో ప్రతి ఆదివారం జరిగే సండే మార్కెట్‌లో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం సెలవు కావడంతో బయటకు వచ్చిన ప్రజలు వర్షానికి తీవ్ర అవస్థలు పడ్డారు. నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌ నెమ్మదించింది. వేసవి వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు ఈ చిన్నపాటి వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. విద్యుత్‌ అంతరాయంతో ఇబ్బంది పడ్డామని స్థానికులు వాపోయారు. వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement