మహిళలపై గృహ హింస నిరోధానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలపై గృహ హింస నిరోధానికి కృషి చేయాలి

May 24 2026 1:33 AM | Updated on May 24 2026 1:33 AM

అధికారులు బాధ్యతతో పని చేయాలి

బాపట్ల: మహిళలపై గృహ హింస నిరోధానికి అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. గృహహింస నిరోధక చట్టం జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు గృహ హింస నుంచి విముక్తి పొందాలంటే చైతన్యంతోనే సాధ్యమని చెప్పారు. హింస నుంచి బయటకు రావాలంటే చట్టంతో స్వేచ్ఛ లభిస్తుందన్నారు. బాపట్ల జిల్లాలో మహిళలపై వేధింపులు, దాడులు, అరాచకాలు తగ్గుముఖం పట్టాయన్నారు. మహిళలపై జరిగిన వేధింపుల నేపథ్యంలో గత ఏడాది 485 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం కేవలం 139 కేసులు నమోదు అయ్యాయన్నారు. గృహ హింస నిరోధక చట్టం కింద గడిచిన నాలుగేళ్లలో 668 కేసులు బాపట్ల జిల్లాలో నమోదయ్యాయన్నారు. 155 కేసులు కోర్టులో పరిష్కారం కాగా, ఐదు కేసులు పోలీస్‌ అధికారుల ద్వారా పరిష్కారం అయ్యాయన్నారు. అందులో 408 కేసులు కోర్టు పరిశీలనలో ఉన్నాయని, మిగిలిన 101 కేసులు విచారణలో ఉన్నట్లు వివరించారు. చట్టం కింద గత ఏడాది 194 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం 82 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. వరకట్న వేధింపులు నిరోధించడానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రజలను చైతన్య పరచడంతోనే వేధింపులను నివారించగలమన్నారు. మహిళలకు చట్టం అండగా నిలుస్తున్న విషయాలపై అవగాహన పెంచాలన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో చైతన్య కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. విద్యార్థి దశ నుంచి ఈ ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలన్నారు. 181 కాల్‌ సెంటర్‌, సఖి కేంద్రం మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లాలని, మహిళలను చైతన్య పరచాలని ఆయన పలు సూచనలు చేశారు. బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్చాలనే అంశంపై ‘బడి పిలుస్తోంది’ అంటూ ఎస్‌ఎఫ్‌ఐఆర్డీ సంస్థ రూపొందించిన పోస్టర్‌లను కలెక్టర్‌ విడుదల చేశారు. సమావేశంలో మహిళ శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, డీఎస్పీ పి.జగదీష్‌ నాయక్‌, సఖి కేంద్రం ప్రతినిధులు ఉషారాణి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పుష్ప, బి కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్యాటకులకు ఉచిత వైద్య సేవలు

ప్రతి రోజూ సూర్యలంక బీచ్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నందున వారికి అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా పీహెచ్‌సీ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. సూర్యలంక బీచ్‌కు వచ్చే పర్యాటకులకు అవసరమైన సమయంలో ఉచిత వైద్య సేవలు అందించేందుకు తుఫాను రక్షిత భవనంలో ఏర్పాటు చేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) జిల్లా కలెక్టర్‌ శనివారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్రంలో అవసరమైన వైద్య సిబ్బంది, ప్రాథమిక చికిత్స పరికరాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

అధికారులు బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం రాత్రి జిల్లా కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి వడగాల్పులు పరిస్థితి, జనగణన, ప్రజా సానుకూలత ప్రజాభిప్రాయం, జలధార–జలహారతి కార్యక్రమాల అమలుపై ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, డీఎల్‌డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల నీటి వనరుల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్‌న్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయాలన్నారు. మరో రెండు రోజులు వడగాడ్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement