కారెంపూడి: స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ సెక్షన్ ఆఫీస్ వద్ద మండలంలోని పేటసన్నెగండ్ల శివారు సింగరుట్ల తండా రైతులు శుక్రవారం రాత్రి ఽఆందోళనకు దిగారు. తమ తండాకు నాలుగు రోజులుగా కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బందికి అధికారులకు ఫోన్ చేసినా లిప్ట్ చేయడం లేదన్నారు. తండాకు వచ్చే జంపర్లు ఎత్తేసి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని రోజుకు అనేక సార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికి కరెంటు లోవోల్టేజీ హైలోవోల్టేజి వల్ల 10 మోటార్లు దాకా కాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసుకు వచ్చినా పట్టించుకునే నాధుడు లేకుండాపోయారన్నారు. దీనివల్ల పంటలకు నీరందక ఎండిపోతున్నాయని తమ బాధలు చెప్పుకోడానికి వస్తే ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదనే బాధను రైతులు వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.


