ఉపాధ్యాయులపై బోధనేతర భారాన్ని తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులపై బోధనేతర భారాన్ని తగ్గించాలి

May 24 2026 1:33 AM | Updated on May 24 2026 1:33 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయులపై బోధనేతర భారాన్ని తగ్గించి, స్వేచ్ఛగా బోధన చేసే అవకాశాన్ని కల్పించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ రాష్ట్ర(ఎస్టీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, సాయి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో రెండు రోజుల రాష్ట్రస్థాయి ఉద్యమ శిక్షణ తరగతులను గుంటూరు శివారులోని విజ్ఞాన్‌ నిరుల ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు విద్యార్థుల అభ్యసనా సామర్‌ాధ్యల పెంపుదలతోపాటు, డ్రా పౌట్ల సంఖ్య తగ్గింపు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యాశాఖ పక్షాన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని డిమాండ్‌ చేశారు. బోధనేతర విధులు అభ్యసనా సామర్ధ్యం పెంపుదల ఒక అడ్డంకిగా ఉన్నాయని, వీటిని తొలగించాలని కోరారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మూడేళ్ల గడువు కేటాయించాలని చెప్పారు. కార్యాచరణ ప్రణాళికల పేరుతో అకడమిక్‌ క్యాలెండర్‌ దారి తప్పకుండా, కాలనిర్ణయ పట్టికను అనుసరించి అన్ని తరగతులకు క్రమానుగతంగా బోధన జరిగేలా, అమలయ్యేలా చూడాలని కోరారు. ఉపాధ్యాయులకు శిక్షణలు, సైన్స్‌ ఫెయిర్ల నిర్వహణ, విద్యార్థులకు క్రీడలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ల నిర్వహణ, నో బ్యాగ్‌ డేల అమలు ప్రణాళికాబద్ధంగా ఫలితం ఆధారిత అమలుకు చూడాలని కోరారు. ప్రశ్నపత్రాల రూపకల్పన, మూల్యాంకనంపై ఉపాధ్యాయ సంఘాలు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకొని విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు. అసెస్మెంట్‌ రిజిస్టర్‌ నిర్వహణ, పాఠశాల సమయంలోనే మూల్యాంకనం, మార్కుల నమోదుపై పున: సమీక్ష అవసరమని తెలిపారు. మార్కుల నమోదు ఉపాధ్యాయుని రిజిస్టర్లో ఒకసారి, లీపు యాప్‌లో ఒకసారి, పాఠశాల సెంట్రల్‌ మార్కు రిజిస్టర్‌లో ఒకసారి ఇలా మూడుసార్లు నమోదు చేయాల్సిన పరిస్థితి వస్తుందని, సాంకేతికతను ఉపయోగించి పాఠశాల మొత్తానికి సమీకృత విధానాన్ని అమలుపరిచేలా చూడాలని సూచించారు. శిక్షణ శిబిరంలో మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సీపీఐ నాయకులు జి.ఈశ్వరయ్య, ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఏఐఎస్టీఎఫ్‌ జాతీయ ఆర్థిక కార్యదర్శి సిహెచ్‌.జోసెఫ్‌ సుధీర్‌ బాబు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు, ఉపాధ్యాయ వాణి ప్రధాన సంపాదకులు కె.వి.శేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement