ఇప్పటికే పెద్ద ఎత్తున భారీ వృక్షాల నరికివేత అక్కడక్కడ మట్టి గుంతల పూడ్చివేత సెంటు రూ.2 లక్షల చొప్పున విక్రయాలు వెలుస్తున్న తాత్కాలిక రేకుల షెడ్లు చోద్యం చూస్తున్న అధికారులు
తాడేపల్లి రూరల్: మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని డోలాస్‌నగర్ శ్మశాన వాటిక వెనుక భాగంలో ఉన్న అటవీ భూముల్లో కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా భారీ వృక్షాలను యంత్రాంల సహాయంతో నేలకూలుస్తున్నారు. ఈ భూముల్లో సుమారు 30–40 సంవత్సరాల వయస్సు ఉన్న తుమ్మ, వేప, గానుక తదితర చెట్లు ఉన్నాయి. సుమారు 5 సెంట్లలో ఈ చెట్లను తొలగించారు. మరోపక్క ఫారెస్ట్ భూముల్లో రాజధాని గ్రామాల్లో చెరువుల తవ్వకం నుంచి వచ్చిన నల్లమట్టితో గుంతలు పూడుస్తున్నారు. అంతేకాకుండా చిన్న నిర్మాణాలు చేపట్టారు. ఉండవల్లి ఫైరింగ్ రేంజ్ నుంచి యర్రబాలెం రోడ్డు వరకు పలు ప్రాంతాల్లో ఫారెస్ట్‌లో ఉన్న మొక్కలను తొలగించారు. అందులో నల్లమట్టి పోసి ప్లాట్లుగా చేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. గతంలో ఫారెస్ట్ అధికారులు ఉన్న ఇళ్లను లెక్కించి నంబర్లు కేటాయించారు. తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కొంతమంది ఇదే అదునుగా భారీ వృక్షాలను తొలగించి రెండు మూడు సెంట్లుగా చేసి ఒక్కో సెంట్ రూ.2 లక్షల చొప్పున అమ్మేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మేం చూసుకుంటాం...
ఉపాధి కోసం మార్కాపురం, ప్రకాశం జిల్లాల నుంచి వలస వచ్చినవారు ఈ ప్రాంతాల్లో అద్దెలు చెల్లించలేక భూములను కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ కొనుక్కునే వారికి ఫారెస్ట్ భూమి అని తెలిసినా అమ్మిన వ్యక్తిని ప్రశ్నిస్తే ‘‘మీరు ఇళ్లు వేసుకోండి, వచ్చిన వారితో మేం మాట్లాడి సెటిల్ చేస్తాం. రూ.10 – రూ.20 వేలు ఇస్తే వారేమీ అనరంటూ’’ భరోసా ఇస్తున్నాడు. యథేచ్ఛగా భూములను అమ్మేస్తున్నారు. ఇప్పటికై నా ఫారెస్ట్ అధికారులు దృష్టి సారించి పర్యావరణానికి హాని కలిగిస్తూ చెట్లను నరికేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


