బాపట్ల: బాపట్ల మండలం సూర్యలంక ఎయిర్ ఫోర్సు స్టేషన్ పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు మిగులున్న తరగతుల సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మృదుల శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల వారు కేంద్రియ విద్యాలయంలో సంప్రదించి ఈనెల 27వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె తెలిపారు.
బాపట్ల: అనంతపురం జిల్లాలో సర్వేలు చేయలేదని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డులలో పని చేసే డిజిటల్ అసిస్టెంట్లు,వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల జీతాలు నిలుపుదల చేయటం సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బాపట్ల జిల్లా చైర్మన్ జీవీవీ రాఘవరెడ్డి ఖండించారు. ఆధార్ కిట్ల వినియోగం, ఎల్‌ఎంఎస్ కోర్సులు పూర్తి చేయలేదని జీతాలు నిలుపుదల చేయటం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. వెంటనే అనంతపురం జిల్లా అధికారులు జోక్యం చేసుకుని జీతాల సమస్యను పరిష్కారించకపోతే రాష్ట్రవ్యాప్తతంగా ప్రత్యక్ష ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
చీరాల: చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో బాలనేరస్తుడిపై నేరం రుజువు కావడంతో ఒంగోలు జువనైల్ జస్టిస్ బోర్డు కమ్–2 అదనపు మెజిస్ట్రేట్ శిక్ష ఖరారు చేశారు. ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో శుక్రవారం ఒంగోలు కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో బాధితురాలి తరఫున ఏపీపీ కె.కళావతి వాదనలు వినిపించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు బాల నేరస్తుడికి పునరావాసం, సత్ప్రవర్తన నిమిత్తం ఒక సంవత్సరం పాటు తిరుపతిలోని ప్రభుత్వ స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్‌లోని ప్లేస్ ఆఫ్ సేఫ్టీకి పంపాలని ఉత్తర్వులు జారీ చేశారు. అలానే బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో బాలనేరస్తుడికి శిక్ష ఖరారు చేయడంతో పాటు బాధితురాలికి త్వరితగతిన న్యాయం చేయడంలో ప్రతిభ కనబరచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అభినందించారు.
ఆందోళనలో బాఽధితులు
మాదల(ముప్పాళ్ల): మండలంలోని మాదల గ్రామానికి చెందిన మందుల దుకాణం వ్యాపారి సుమారు రూ.20లక్షల వరకు అప్పులు తీసుకొని అదృశ్యమవటంతో అప్పులిచ్చిన వారంతా లబోదిబోమంటున్నారు. సదరు వ్యాపారి మాదల గ్రామంలోని ప్రదాన కూడలిలో అద్దె ఇంట్లో ఉంటూ మందుల దుకాణం నిర్వహిస్తూ గ్రామంలోను, సత్తెనపల్లిలోను పలువురి వద్ద వడ్డీకి నగదు తీసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారంతా ఒత్తిడి చేస్తుండటంతో కాలయాపన చేస్తూ మాదల గ్రామంలో తనకున్న 147 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని ఈ ఏడాది మార్చి 23, 2026న విజయవాడకు చెందిన వారికి అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే గ్రామం విడిచివెళ్లిపోయాడు. వ్యాపారి నుంచి అప్పలు ఇచ్చిన వారందరికీ ఈ నెల 18 వ తేదీన ఐ.పీ నోటీసులు అందటంతో ఖంగుతిన్నారు. వడ్డీకి ఆశపడి కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఇచ్చింది కాక నోటీసులు రావటంతో గ్రామంలో కలకలం నెలకొంది. కోర్టు నుంచి నోటీసులు అందుకోవటంతో బాఽధితులు లబోదిబో మంటున్నారు. బాఽధితుల్లో ఒకరైన యర్రంశెట్టి సుబ్బారావు అనే వ్యక్తి సదరు వ్యాపారి 2024 ఏప్రిల్ 4వ తేదీన రూ.రెండు లక్షలు మద్యవర్తి ద్వారా తీసుకున్నాడని, న్యాయం చేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లోను ఫిర్యాదు చేశారు.
నరసరావుపేట టౌన్: గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ సీహెచ్ ప్రభాకర్ శుక్రవారం తెలిపారు. విజేత థియేటర్ సమీపంలో గుర్తుతెలియని యువకుడు మృతి చెంది ఉన్నాడన్నా సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ కోరారు.
బాపట్ల: వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కోళ్ల భువనేశ్వరిని నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కోళ్ల భువనేశ్వరిని పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నియమించటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.


