గుంటూరు మెడికల్: గుంటూరు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతి పొందారు. గురువారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డాక్టర్ కొర్రా విజయలక్ష్మిని వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు. డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొందారని, త్వరలో స్థల కేటాయింపు జరుగుతోందని డాక్టర్ విజయలక్ష్మి వెల్లడించారు. కార్యక్రమంలో ప్రొగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, డాక్టర్ సుజాత, డాక్టర్ ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధతో బోధన చేయాలని పాఠశాల విద్య ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ–సమగ్రశిక్ష ఆధ్వర్యంలో గురువారం అమరావతిరోడ్డులోని నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూలులో గుంటూరు జోన్ పరిధిలోని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవో–2లకు ఒక్కరోజు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి పర్సనల్ ఎడాప్టివ్ లెర్నింగ్ (పల్), టీచ్ టూల్, మధ్యాహ్న భోజన పథక అమలుపై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో పాఠ్యాంశాల ఆధారిత విజ్ఞానాన్ని అభివృద్ధి పర్చి, సంబంధిత సబ్జెక్టులపై పట్టు సాధించేలా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ చూపించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో పల్ రాష్ట్ర నోడల్ అధికారి బి.కిఫోర్‌బాబు పాల్గొన్నారు.
చేబ్రోలు: చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెం గ్రామంలోని క్వారీ ప్రాంతాన్ని గురువారం విజిలెన్స్, మైనింగ్, రెవెన్యూ అధికారుల బృందం పరిశీలించింది. వివిధ అంశాలలో సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. వీరనాయకునిపాలెం గ్రామానికి చెందిన మెండెం ప్రభుదాసు 2024లో అక్రమ మైనింగ్‌పై గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై రెండు రోజులుగా విజిలెన్స్ అండ్ ఎన్‌పోర్సుమెంట్ అసిస్టెంట్ జియాలజిస్ట్ జి అనీల్, మైనింగ్ ఆర్‌ఐ సీహెచ్ ఆంజనేయులు, తహసీల్దారు కె శ్రీనివాసశర్మ, సర్వేయర్లు వీరనాయకునిపాలెం క్వారీ ప్రాంతాన్ని పరిశీలించి వారికి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. రెండు రోజులపాటు ఆధునిక యంత్ర పరికరాలతో ప్రభుత్వ స్థలాలు, సర్వే నెంబర్లు, క్వారీలోని లోతు, ఎన్ని మెట్రిక్ టన్నుల గ్రావెల్ తరలించారు. అనే విషయాలపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేయటం కోసం అధికారుల బృందం పరిశీలించింది.


