అన్నదాతలకు కన్నీళ్లు | - | Sakshi
Sakshi News home page

అన్నదాతలకు కన్నీళ్లు

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

దిక్కుతోచని స్థితిలో జిల్లా రైతులు

భారంగా ఎరువు ధరలు.. విత్తనం కోసం కష్టాలు

వరికి ప్రత్యామ్నాయం చూపాలంటున్న అన్నదాతలు

నేటికీ అందని మోంథా తుపాను నష్టపరిహారం

పంటలకు దక్కని గిట్టుబాటు ధరలు

ముంచుకొస్తున్న ఖరీఫ్‌ సీజన్‌

విత్తనాలు దొరక్క..

మెరుగైన సేవలకు కృషి

వరి సాగు పెరిగే అవకాశం

దిక్కుతోచని స్థితిలో జిల్లా రైతులు

చీరాల అర్బన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన ఉండదు. ఎన్నికల వేళ పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రిస్తామన్నారు. అది జరగకపోగా నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపు కొనసాగుతోంది. ఈ క్రమంలో వ్యవసాయ రంగానికి సంబంధించి వరి సాగు తగ్గించాలని పదే పదే చెప్పారు. అయితే మాగాణి సాగు తగ్గిస్తే, ప్రత్యామ్నాయం ఏంటని సాగుదారులకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఖరీఫ్‌ పంట కాలం ముంచుకొస్తోంది. విత్తనాల కొరత వెంటాడుతోంది. ఇప్పటికే పలు రకాల ఎరువుల ధరలను పెంచారు. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన మోంథా తుపాను పంట నష్టపరిహారం ఇప్పటికీ అందలేదు. బ్యాంకర్లు రుణగ్రహీతల్లో స్థితిమంతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సన్న, చిన్నకారు రైతుల పట్ల చిన్నచూపు చూస్తున్నారు. దీంతో సాగు సంకటంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాటి పరిస్థితి తలకిందులు..

కొమ్ముమూరు ఆయకట్టుకు జిల్లా ధాన్యాగారంగా పేరు. మాగాణికి పుట్టిల్లు. ఇది ఒకప్పటి మాట. ముఖ్యమంత్రి చంద్రబాబు వరి సాగు తగ్గించాలని చెబుతున్నారు. తాను వరన్నం తినడం లేదంటారు. మిల్లెట్స్‌ వైపు దృష్టి సారించాలని సూచించారు. మాగాణి రైతులకు వరి సాగుకు ప్రత్యామ్నాయం ఏంటనేది మాత్రం ఆయన చెప్పలేరని విమర్శలు ఉన్నాయి. దీంతో జిల్లా ధాన్యాగారంగా గొప్పగా చెప్పుకున్న రైతులే నేడు తమ పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎరువుల ‘బరువు’

జిల్లాలో గత ఏడాది ఖరీఫ్‌లో 1.27 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. రబీలో 1.78 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. గత ఏడాది యూరియా కొరత వెంటాడింది. రైతులకు అవసరమైన మేర సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాగాణి రైతులు యూరియా వాడకం తగ్గించాలని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది పంట కాలానికి ముందే పలు రకాల ఎరువుల ధరలను పెంచారు. ఇది రైతులకు అదనపు భారం.

ఖరీఫ్‌ పెట్టుబడులు కష్టమే..

ఽగిట్టుబాటు ధరలు అటుంచి మద్దతు ధరలు కూడా పూర్తి స్థాయిలో అందక ఉత్పత్తులను అరకొరగానే విక్రయించారు. అయితే ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం కావాలంటే పెట్టుబడులకు రైతులు అరువు బాట పట్టాల్సి వస్తోంది. గత ఏడాది అక్టోబర్‌ మాసంలో మోంథా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటలు నీట మునిగాయి. భారీగా నష్టపోయారు. జిల్లాలో 18,609 మంది రైతులకు గాను 12,700 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు నమోదు చేశారు. పరిహారంగా రూ.2,395 లక్షలు అందాల్సి ఉంది.

సన్న, చిన్నకారు రైతులకు దక్కని

బ్యాంకు రుణాలు

రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. కొత్తగా బాధ్యతలు స్వీకరించా. జిల్లాలో ఎక్కడా రైతుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా మా పరిధిలో మేం పూర్తి స్థాయిలో పని చేస్తాం. ఇండెంట్‌ ప్రకారం విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపడతాం. ప్రభుత్వానికి నివేదిస్తాం.

లక్ష్మి, డీఏఓ, బాపట్ల

గత ఏడాది మొక్కజొన్న, వేరుశనగకు సంబంధించి సాగుదారులు కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. దీంతో ఈ ఏడాది కొంతమేర వరి సాగు పెరిగే అవకాశం ఉంది. జూన్‌ 15 నుంచి ఖరీఫ్‌ పంట కాలం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం సబ్సిడీపై యంత్రపరికరాల పంపిణీ జరుగుతోంది. తరువాత ముందస్తుగా పచ్చిరొట్ట విత్తనాలు, ఇతర విత్తనాలు ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేస్తాం. పచ్చి రొట్ట విత్తనాలకు 50 శాతం సబ్సిడీ ఉంటుంది. ఒక్కో రైతుకు విస్తీర్ణం ఎంత ఉన్నా హెక్టారుకు మాత్రమే సబ్సిడీ విత్తనాల పంపిణీ జరుగుతోంది.

– నిర్మలాదేవి, ఏఓ, చీరాల

జూన్‌ 15వ తేదీ నుంచి ఖరీఫ్‌ పంట కాలం మొదలవుతుంది. అందుకు ముందస్తుగా పచ్చిరొట్ట విత్తనాలను చేలలో ఎద పెడతారు. మొక్క పెరిగాక భూమిలో కలియదున్నుతారు. దీంతో భూమికి పోషకాలు లభించి భూసారం పెరుగుతుంది. అయితే ఈ ఏడాది ఇంతవరకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ జరగలేదు. సబ్సిడీపై ఇచ్చే విత్తనాలు కూడా అరకొరగానే ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్‌లో 1.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే పరిస్థితి ఉంది. అందుకుగాను వ్యవసాయ శాఖ పరంగా పచ్చిరొట్ట విత్తనాలు 2,957 క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేయనున్నారు. ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక హెక్టారుకు మాత్రమే 50 శాతం సబ్సిడీపై ఆ విత్తనాలు ఇస్తారు. అంతకన్నా అవసరమైతే ప్రయివేటు మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిందే. వరికి సంబంధించి బీపీటీ 5204 రకం 800 క్వింటాళ్లు, ఎంటీయూ 1224 రకం 350 క్వింటాళ్లు, ఎంటీయూ 1061రకం 219 క్వింటాళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. చీరాల డివిజన్‌లోని మాగాణి రైతుల్లో ఎక్కువ మంది ఎంటీయూ 1262 రకం వరి విత్తనాలను అడుగుతున్నారు. దీంతో వారు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్ధితి నెలకొంది. శనగలు జె.జి. 11 రకం 2176 క్వింటాళ్లు, కాక్‌ 2 రకం 2,200 క్వింటాళ్లు, ఎన్‌బీఈజీ 452 రకం 42 క్వింటాళ్లు పంపిణీకి సిద్ధం చేశారు. ఇవి కూడా సాగయ్యే విస్తీర్ణానికి పూర్తి స్థాయిలో సరిపోవడం లేదు. ఇక ఇతర విత్తనాల పరిస్థితి అదే విధంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement