కాలువలోకి
దూసుకెళ్లిన కారు
చీరాల: వేగంగా వెళుతున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి చీరాల– కారంచేడు రోడ్డులోని లారీ యూనియన్ ఆఫీస్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు... చీరాలలోని జవహర్‌నగర్‌కు చెందిన మనోజ్, వరుణ్, హేమంత్ కారులో చీరాల నుంచి కారంచేడు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో చీరాల సమీపంలోని లారీ యూనియన్ కార్యాలయం వద్ద కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మనోజ్(16) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మనోజ్ ఇటీవల పదో తరగతి పూర్తి చేశాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు క్షతగాత్రుల వద్ద నుంచి అవుటుపోస్టు పోలీసులు వివరాలను నమోదు చేసుకున్నారు.


