అనధికారికంగా తుక్కు చేస్తే.. తంటాలే వాహనాల స్క్రాప్ విషయంలో జాగ్రత్తలు అవసరం
అవగాహన లేక....
పట్నంబజారు: డబ్బులు పడేసిన లెక్కవేసి పడేయాలంటారు.. అలాగే వాహనాల విషయంలో పక్కాగా లెక్క ఉండాల్సిందే. వాహనం వయసు అయిపోయిందిలే.. సెంకడ్ హ్యాండ్ అమ్మేద్దాం.. లేదా స్క్రాప్‌కు పంపుదాం అనుకుంటే పొరపాటే. ప్రతి వాహనం కొనుగోలు చేసిన తరువాత దాని కాల పరిమితి 15 సంవత్సరాలు. ఆ తరువాత వాహన ఇంజన్ పరిస్థితిని బట్టి ఐదేళ్ల నుంచి మరింత పైగా వాహనాలకు కాలపరిమితిని పెంచే అవకాశం రవాణాశాఖ అధికారులకు ఉంది. కేవలం నూతన వాహనం కొనుగోలు చేసే క్రమంలో ప్రతి ధ్రువీకరణ పత్రాన్ని చూస్తాం. అలాగే వాహనం అది ద్విచక్రమైన, కారైనా, అంబులెన్స్, ఆటో మరేదైనా.. కచ్చితంగా వాహనం స్క్రాప్(తుక్కు) చేసే ముందుకు అధికారులకు ధరఖాస్తు ఎంతో అవసరం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. లేకుంటే ఆ వాహనంతో ఏదైనా ప్రమాదం జరిగినా.. ఏదైనా ఘటన చోటు చేసుకున్నా.. ఆ వాహన యజమాని కచ్చితంగా బాధ్యత వహించాల్సిందే.
జిల్లాలో వాహనాలు ఇలా...
జిల్లాలో మొత్తం సుమారు 2 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. వాటిలో 26,515 లారీలు, 1,603 మ్యాక్సీ క్యాబ్‌లు, 6,452 మోటార్ క్యాబ్‌లు, 16,800 కమర్షియల్ ట్రాక్టర్లు, 29,905 ఆటోలు, 2800పైగా స్కూల్ బస్సులతో పాటు ఇతరత్రా ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు కలుపుకుని మొత్తం 2లక్షకుపైగా వాహనాలు ఉన్నాయి. అయితే వాటీలో అనేక సంవత్సరాలుగా త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు ఉన్నాయి. అధికారుల గణంకాల ప్రకారం ఇప్పటి వరకు 8,000పైగా ఉన్నట్లు గుర్తించారు. వాటిలో ఒక త్రైమాసికం చెల్లించనవి 750, రెండుకుపైగా చెల్లించనవి 376, మూడు త్రైమాసికాలు 293, నాలుగు చెల్లించనవి 400పైగా, ఐదు త్రైమాసికాలవి 220పైగా, ఐదుకు పైగా ఉన్నవి సుమారుగా ఐదు వేలకు పైగానే ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.
మూలన పడ్డవి ఎన్నో....
జిల్లాలో త్రైమాసిక పన్నులు చెల్లించాల్సిన వాహనాలు 8,000 ఉండగా వాటిలో అసలు ఎన్ని మూలన పడ్డాయో.. ఎన్ని వాహనాలు కేసుల్లో ఉన్నాయో.. ప్రమాదాల్లో గురై ఆయా స్టేషన్‌లు, ఆర్టీఏ కార్యాలయాల్లో వదిలేసినవి, ఇతరత్రా కారణాలతో వదిలేసినవి వేలల్లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్‌కు వేయటం, ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు తీసుకుని వెళ్లిన వాహనాల గురించి పట్టించుకోకపోవటం, విక్రయించిన వాహనాల గురించి సమాచారం ఇవ్వకపోవటం వంటివి ప్రధానంగా గుర్తించారు. సుమారు 3వేలకుపైగా వాహనాలు స్క్రాప్‌తోపాటు, ఇతర అంశాల్లో సంబంధిత యజమానుల వద్ద లేనట్లు గుర్తించారు.
పన్ను పడుతూనే ఉంది...
వాహనాలకు సంబంధించి యజమానుల దగ్గర వాహనం లేనప్పటికీ త్రైమాసిక పన్నులు మాత్రం పడుతూనే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వాహనదారులు వాహనాలు స్క్రాప్‌కు వేసినా, ఇతరత్రా అంశాల్లో కోల్పోయినా.. కనీసం అధికారులకు సమాచారం ఇవ్వకపోవటంతోనే వాటికి పన్నులు పడుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు వాహనాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారు. వాహనాన్ని స్క్రాప్ కింద తీసివేసినా, ఫైనాన్స్ వారు తీసుకుపోయినా, ప్రమాదం జరిగి ఎక్కడైనా వాహనం నిలిచిపోయినా.. తప్పని సరిగా తెలియజేయాల్సి ఉందని నిబంధనలు చెబుతున్నాయి. ఈ మూడేళ్ల వ్యవధిలో కేవలం రెండు వేల వాహనాలు మాత్రమే స్క్రాప్‌కు ధరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సుమారు 1400పైగా బైక్‌లు ఉన్నాయి.
ముఖ్యంగా వాహనాలను స్క్రాప్‌కు పంపే విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్న అంశంపై ప్రజల్లో అవగాహన లేకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. ఫైనాన్స్ కంపెనీల వారు తీసుకుని వెళ్లటం, వాటికి సంబంధించి యజమానులు దరఖాస్తు చేసుకోవటంపోవటం వలన పన్నులు పెరిగిపోతున్నాయని అధికారులు గుర్తించారు. స్క్రాప్‌కు వేసిన వాహనంకు సంబందించి ఛాయిస్ నంబర్లు దుర్వినియోగానికి పాల్పడితే.. దానికి సంబందించి వాహన యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.


