దుగ్గిరాల బాధిత పసుపు రైతుల వినతి
కొరిటెపాడు(గుంటూరు): దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్నిప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాకు రూ.7,000 చొప్పున పరిహారం చెల్లించాలని బాధిత రైతులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఇన్సూరెన్‌న్స్ సొమ్ము కలిపి క్వింటాకు రూ.5,000 చొప్పున ఇస్తామని ఫైనల్ సెటిల్‌మెంట్‌గా భావించి తమతో సంతకాలు చేయించారని వెల్లడించారు. అయితే దానికి తాము అభ్యంతరం తెలిపామని, 2024 జూలైలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వద్ద రూ.7,000 చొప్పున ఇస్తామని కోల్డ్‌స్టోరేజీ యాజమాన్యం ఒప్పందానికి వచ్చిందని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సంబంధించి ఇచ్చిన మార్పు లేఖను అంగీకరించి, తాము తయారుచేసిన పత్రాన్ని యాజమాన్యం అంగీకరించే వరకు నగదు పంపిణీ నిలిపివేయాలని అధికారులను కోరడం జరిగిందని వెల్లడించారు. అయినప్పటికీ రూ.5,000 పరిమితం చేసి ఫైనల్ సెటిల్‌మెంట్‌గా రసీదులు ఇవ్వడం అన్యాయమని బాధిత రైతులు ఎల్.భాస్కరరెడ్డి, రాజేష్, కళ్లం సీతారామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
లక్ష్మీపురం: బక్రీద్ రోజున అనధికార జంతు వధ నిషేధమని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. గోవులను వధించరాదని, అధికారికంగా ఽధ్రువీకరించిన గొర్రెలు, మేకలను మాత్రమే వధింపుటకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. అనధికార జంతు వధపై సమాచారం అందించాలని కోరారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్– 8688831391, పశు సంవర్ధక శాఖ– 8333086999, గుంటూరు మునిసిపాల్ కార్పొరేషన్ – 9849908363, పొన్నూరు మునిసిపాలిటీ – 9849905834, తెనాలి మునిసిపాలిటీ – 9849905830, ఎంటీఎంసీ– 7093320018, తెనాలి సబ్‌కలెక్టర్– 9849904008, రెవెన్యూ డివిజినల్ అధికారి, గుంటూరు – 9849904006, జిల్లా పంచాయతీ అధికారి– 9492758041.
గుంటూరు రూరల్: ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు.. తాడికొండ మండలం పాములపాడుకు చెందిన దొడ్డా పవన్‌కుమార్(35) నగరంలోని ఒక రియల్ ఎస్టేట్ కార్యాలయంలో పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం కార్యాలయంలో పనిముగించుకుని ఇంటికి వెళుతున్నాడు. అదే సమయంలో నగర శివారుల్లోని ఎన్‌హెచ్ 16లో ఉన్న ఒక ప్రైవేటు కళాశాల బస్సు డ్రైవర్ అమరావతి రోడ్డు గోరంట్ల చిల్లీస్ సెంటర్ సమీపంలో విద్యార్థులను దింపి కళాశాలకు వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటున్నాడు. అదే రోడ్డులో వస్తున్న పవన్‌కుమార్ యూటర్న్ తీసుకుంటున్న బస్సుకు ఢీకొన్నాడు. ప్రమాదంలో పవన్‌కుమార్ తీవ్రగాయాలు కాగా అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో 2026 ఫిబ్రవరిలో జరిగిన ఎంబీఏ(హెచ్‌ఎ) ఇంటిగ్రేటెడ్, ఎంఏ పబ్లిక్ పాలసీ 1వ సెమిస్టర్ ఫలితాలను బుధవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాద్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఎంబీఏ(హెచ్‌ఎ) ఇంటిగ్రేటెడ్ పరీక్షకు 87 మంది హాజరు కాగా 54 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఎంఏ పబ్లిక్ పాలసీ పరీక్ష 52 మంది రాయగా 50 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈనెల 28 వరకు రీవ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకుని, అనంతరం ఆ దరఖాస్తులను 29వ తేదీలోపు పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.1,860 చెల్లించాలని, పర్సనల్ వెరిఫికేషన్‌కు రూ.2,190 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.
బాపట్ల: తేనెటీగలు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, పంటల పరాగసంపర్కంలో తేనెటీగల సేవలు వ్యవసాయ దిగుబడులను పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూన రాణి అన్నారు. ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల వ్యవసాయ కళాశాల కీటక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తేనె ఉత్పత్తితో పాటు తేనెటీగల పెంపకం గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉత్తమ వాణిజ్య రంగమని వివరించారు. కీటక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎస్.ఆర్.కోటేశ్వరరావు మాట్లాడుతూ తేనెటీగల పెంపకంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంభించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. తేనె ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ అంశాలలో శిక్షణ పొందితే స్వయం ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని చెప్పారు. రైతులు, యువత తేనెటీగల పెంపకాన్ని అనుబంధ వ్యవసాయ వృత్తిగా స్వీకరించాలని సూచించారు. తేనెటీగలపై పరిశోధన చేస్తున్న ఎం.సాయికుమార్ తన పరిశోధనలోని పలు ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.


