కేసీపీకి బెస్ట్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ అవార్డు | - | Sakshi
Sakshi News home page

కేసీపీకి బెస్ట్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ అవార్డు

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

కేసీపీకి బెస్ట్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ అవార్డు వేగంగా జల్‌ జీవన్‌, స్వచ్ఛ భారత్‌ పనులు రీసర్వేలో అక్రమాలపై విలేజ్‌ సర్వేయర్‌, వీఆర్‌ఓ సస్పెన్షన్‌ ప్రజలను మోసం చేస్తున్న ముఠా అరెస్టు

మాచర్ల రూరల్‌: కార్మికుల సంక్షేమ, కర్మాగారంలో భద్రత, పరిశుభ్రతతో పాటు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ పాటిస్తున్న కేసీపీ సిమెంట్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కర్మాగారం, శ్రమశక్తి అవార్డును అందజేసింది. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కలక్షేత్రంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ చేతుల మీదుగా అవార్డును సీనియర్‌ మేనేజర్‌ కె.వెంకటరమణ అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ దశాబ్దాలుగా కేసీపీ సిమెంట్స్‌ నాణ్యతలో రాజీ పడకుండా, కార్మికుల భద్రత, వారి కుటుంబ సంక్షేమలో యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి బెస్ట్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ, శ్రమశక్తి అవార్డును అందించిందన్నారు. ఇదే స్ఫూర్తితో ఉత్పత్తిలో నాణ్యత, ఉద్యోగుల భద్రతలో మరింత ప్రమాణాలు పాటిస్తూ ముందుకు పోతామన్నారు. రాష్ట్రస్థాయిలో కేసీపీ సంస్థకు బెస్ట్‌ అవార్డు రావడంపై ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఆనంద వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.

నరసరావుపేట: జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌ 2.0, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజనా సింహ పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతి లాల్‌ దండే నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్‌కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంతి లాల్‌ దండే మాట్లాడుతూ జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను వేగవంతం చేసి, పూర్తి చేసిన పథకాలను గ్రామ పంచాయతీలకు అప్పగించే ప్రక్రియను త్వరితగతిన ముగించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ జల్‌ జీవన్‌ మిషన్‌ 2.0 కింద గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పీఎం పథకాలతో గ్రామాలకు ప్రాధాన్యతనిస్తూ తాగునీటి కనెక్షన్లను అందిస్తున్నామన్నారు. నీటి నాణ్యత పర్యవేక్షణ, గ్రామస్థాయి ఎఫ్‌టీకే పరీక్షలు, స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి సదుపాయాల నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూస్తున్నామని పేర్కొన్నారు.

నరసరావుపేట: రీసర్వేలో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై అచ్చంపేట మండలం కోనూరు గ్రామ సర్వేయర్‌ కిరణ్‌ కుమార్‌, వీఆర్‌ఓ వెంకయ్యలను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజనా సింహా బుధవారం సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చారు. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో కోనూరు గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదరు అధికారులు ఇద్దరూ భూమి కొలతలు, రెవెన్యూ రికార్డుల మార్పులు, ఇతర ప్రభుత్వ సేవల కోసం పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్‌ చేస్తున్నారని, తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ ఆధారంగా ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసర్వే విషయంలో అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

నరసరావుపేట రూరల్‌: రూ.3వేలు చెల్లిస్తే రూ.3లక్షలు, ఆతర్వాత రూ.కోటి వస్తాయంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టుచేసినట్లు రూరల్‌ సీఐ ఎం.వి.సుబ్బారావు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.6లక్షల నగదు, ఒక ల్యాప్‌టాప్‌, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బుధవారం సాయంత్రం రూరల్‌పోలీసుస్టేషన్‌ ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన నాగండ్ల వెంకటరావు, నాగండ్ల వంశి, అదే మండలం కావూరు గ్రామానికి చెందిన దేవళ్ల నరసింహారావు, తెలంగాణ రాష్ట్రం మంచీర్యాల జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన పెండ్యాల నీరజలను అరెస్టు చేశామన్నారు. కేశానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎల్‌టీ నగర్‌లో ధూళిపాళ్ల సైదావలి ఇంటివద్ద నిందితులు ఓ కార్యాలయం ఏర్పాటుచేసి నరసరావుపేట మండలం చుట్టుపక్కల ప్రజలకు మాయమాటలు చెప్పి రూ.3వేలు డిపాజిట్‌ చేస్తే తొలుత రూ.3లక్షలు అకౌంట్‌లో వేస్తారని, ఆ తర్వాత రూ.కోటి, ఆ తర్వాత రూ.25కోట్లు అకౌంట్‌లో వేస్తారంటూ నమ్మబలుకుతూ వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతున్నారన్నారు. దీనిపై మండలంలోని కేసానుపల్లి గ్రామ వీఆర్‌ఓ పామిశెట్టి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టుచేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement