పూడికతీతలోనూ నిర్లక్ష్యమే | - | Sakshi
Sakshi News home page

పూడికతీతలోనూ నిర్లక్ష్యమే

May 20 2026 2:16 AM | Updated on May 20 2026 2:16 AM

గుర్రపు డెక్క, తూటికాడతో పూడుకుపోయిన డ్రెయిన్లు పూడికతీత ఊసెత్తని చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఖరీఫ్‌కు ముందే తీయించిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వేసవిలోనైనా పనులు చేపట్టాలని రైతుల డిమాండ్‌

త్వరలో పనులు ప్రారంభిస్తాం

రేపల్లె: ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్నలను మురుగు కాలువల సమస్య వెంటాడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ ఖరీఫ్‌లో వరి పంటకు ముంపు బెడద తప్పేలా లేదు. తీరంలో నెలల తరబడి కష్టించిన రైతులకు పంట చేతికొచ్చే సమయంలో వర్షం కురిసిందంటే కాల్వల్లోని గుర్రపుడెక్క, తూటికాడ సమస్య వేధిస్తోంది. పంట చేతికొచ్చే సమయంలో ఆకస్మికంగా కురిసే వానలతో పొలాల్లో చేరిన వర్షపు నీరు బయటకు పోయే పరిస్థితులు కనిపించడం లేదు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వంగా వారి కష్ట సుఖాలనెరిగి ఖరీఫ్‌కు ముందే అవసరమైన డ్రెయిన్లలో తూటికాడ, గుర్రపు డెక్కలను తొలగించి సమస్యను పరిష్కరించేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేపల్లె డివిజన్‌లోని డ్రెయిన్‌లలో పూడిక తీయించిన దాఖలాలు లేవు. ఈ వేసవిలోనైనా పూడికలు తీయించి ఖరీఫ్‌కు ముంపు బెడద నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు.

ప్రధాన డ్రెయిన్లు ఇవే...

రేపల్లె సబ్‌ డివిజన్‌లో ప్రధానంగా ఉన్న ఆర్‌ఎం డ్రెయిన్‌, బీఏం డ్రెయిన్‌, జగజ్జెరువు కాలువ, రేపల్లె మురుగు కాలువ, వాడమురుగు డ్రెయిన్‌, రేపల్లె న్యూకోర్స్‌, ఓల్డ్‌ కోర్స్‌ కాలువలలో తూటి కాడ, గుర్రపు డెక్క, జన్నే కాలువ, బడే కాలువ, సౌత్‌మీడియం డ్రెయిన్‌, పిల్లివాగు డ్రెయిన్‌, తగడాల డ్రెయిన్‌ తదితర చోట్ల ప్లాస్టిక్‌, చెత్త చెదారాలు పేరుకుపోయాయి. వీటి ద్వారానే పంట పొలాల్లో వర్షపు నీరు బయటకు పోవాల్సి ఉంది. రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె, రేపల్లె మండలం, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల్లో 34,060 హెక్టార్లలో ఖరీఫ్‌ వరి సాగు అవుతోంది. ఈ భూమిలో వృథా నీరుతోపాటు అధిక వర్షాలు కురిసిన సమయంలో వదర ఈ ప్రధాన మురుగు కాల్వల ద్వారానే పారుదల కావాల్సి ఉంది. కాలువలు పూడుకుపోయి ఉండటంతో నీటి పారుదల ప్రశ్నార్థకంగా ఉందని రైతులు భయాందోళనలు చెందుతున్నారు. పంట చివరి దశ నవంబర్‌, డిసెంబర్‌ మాసాలలో ఈ ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ఆ సమయంలో సకాలంలో నీరు పారుదల కాకుంటే పంట ముంపునకు గురై తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతన్నలు భయాందోళనలకు గురవుతున్నారు.

త్వరగా పనులు చేపట్టాలి

వర్షాలు పడే సమయంలో కాలువల ద్వారా నీరు బయటకు పోయేలా అధికారులు డ్రెయిన్ల పూడికతీత పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. వేసవి ప్రారంభమై నెల గడుస్తున్నా అటు పాలకులు, ఇటు అధికారులు పూడికతీత పనుల ఊసెత్తకపోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు స్పందించి పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.

రేపల్లె వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలోని రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలో ప్రధాన మురుగు కాల్వలలో పూడికతీతకు ప్రభుత్వం నుంచి రూ.1.50 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. టెండర్ల ప్రక్రియ ముగిసింది. పనులు త్వరలో ప్రారంభించి ఖరీఫ్‌ నాటికి పనులు పూర్తి చేస్తాం.

– పి.వీరయ్య, డ్రైనేజీ డీఈఈ, రేపల్లె

Advertisement
 
Advertisement
Advertisement