ద్రోణాదుల సొసైటీలో నిధుల్లో అవకతవకలు సొసైటీ గేటు వద్ద రైతుల నిరసన నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారుల తీరు
నిందితులపై చర్యలు తీసుకుంటాం
మార్టూరు: ‘ఒక్కరి కోసం అందరు.. అందరి కోసం ఒక్కరు‘ అనే సూత్రాన్ని ప్రాతిపదికగా చేసుకొని ఏర్పడిందే సహకార బ్యాంకింగ్ వ్యవస్థ. కానీ నేడు కొందరు స్వార్థం కోసం ఆ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారు. అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధుల తీరే దీనికి కారణం. బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామ సొసైటీలో దాదాపు రూ.50 లక్షల మేరకు గోల్‌మాల్ జరిగిందని సొసైటీ గేటు వద్ద రైతులు మంగళవారం నిరసనకు దిగారు. సొసైటీలో వందలాదిమంది రైతులు రుణాలు తీసుకున్నారు. తిరిగి చెల్లించడానికి ఇటీవల కొందరు వెళ్లారు. మధ్యలో తాము చెల్లించిన మొత్తం జమ కాకపోవడం, తీసుకున్న రుణం కన్నా అధిక మొత్తాలు తమ పేరిట కనిపించడంతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషనుకు పంచాయితీ చేరింది. సొసైటీ మాజీ సీఈవో పెంట్యాల అనిల్ కుమార్ పోలీసులు ఎదుట తాను వాడుకున్న నిధులను తిరిగి చెల్లిస్తానని ఒప్పుకొని తర్వాత కనిపించకుండా తిరుగుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.50 లక్షలకుపైగా అనిల్ కుమార్ అవకతవకలకు పాల్పడినట్లు బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం సొసైటీకి కేటాయించిన నాలుగు లారీ లోడుల కాంప్లెక్స్ ఎరువులను అనిల్ కుమార్ బయట గ్రామాల్లో విక్రయించినట్లు ఆరోపణల నేపథ్యంలో అతడిని ఇటీవల ద్రోణాదుల నుంచి కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామ సొసైటీకి బదిలీ చేశారు. అధికారులు ఇలా చేతులు దులుపుకోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దల ప్రమేయంపై అనుమానాలు
తమ కష్టార్జితాన్ని అనిల్ కుమార్ ఒక్కడే కాజేయలేదని,. కొందరు పెద్దల ప్రమేయం కూడా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. విచారణ జరిపించి వారి బండారం కూడా బయటపెట్టి కేసులు నమోదు చేసేంతవరకు సొసైటీ గేటు ముందు నిరసన ఆపబోమని రైతులు భీష్మించుకున్నారు. పరిమితికి మించి లోన్లు మంజూరు చేయటం, రుణాలలో దాదాపు నాలుగో వంతు అధికారులు, సిబ్బంది స్వాహా చేయడం, విపరీతంగా కమీషన్‌లు వసూలు చేయటం, దశలవారీగా చెల్లించిన రుణాలు సంబంధిత రైతుల ఖాతాలలో జమ కాకపోవటం వంటి సమస్యలతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. రైతుల కష్టార్జితాన్ని స్వాహా చేసి ఆస్తులు కూడబెట్టిన మాజీ సీఈవో అనిల్ కుమార్‌ను పోలీస్ స్టేషన్కు పిలిపించాలని, అతని ఆస్తులు అమ్మి తమను రుణ విముక్తులుగా చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.
రెండు రోజుల క్రితమే డీసీవోగా బాధ్యతలు తీసుకున్నాను. ద్రోణాదుల సొసైటీలో నిధుల గోల్‌మాల్ గురించి తెలిసింది. సంబంధిత వ్యక్తులపై శాఖాపరమైన విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటాం.
– యల్లమందరావు, డీసీవో


