బాపట్ల: జన గణన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తన కుటుంబం వివరాలు నమోదు చేయించారు. మంగళవారం కలెక్టర్ బంగ్లాకు జనాభా లెక్కల సేకరణకు వచ్చిన సిబ్బందికి వివరాలు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జన గణన ప్రక్రియను ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకుని సరైన సమాచారాన్ని అందించాలని సూచించారు. ప్రభుత్వం రూపొందించే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు జనగణన సమాచారం ఎంతో కీలకమని తెలిపారు. జనాభా లెక్కల సేకరణలో పాల్గొనే సిబ్బంది నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని, ప్రజలు కూడా సహకరించాలని కలెక్టర్ సూచించారు.
చిలకలూరిపేట టౌన్: పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున చిలకలూరిపేట మండల పరిధిలోని తాతపూడి జాతీయ రహదారిపై రూరల్ ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్ తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి చైన్నె వైపు వెళ్తున్న ఐరా ట్రావెల్స్ బస్సును ఆపి సోదా చేశారు. ఎటువంటి పత్రాలు లేని రూ.45.30 లక్షల నగదు వెలుగుచూసింది. పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని, నరసరావుపేటకు చెందిన షేక్ మొహమ్మద్ హనీఫ్‌ను విచారించారు. చైన్నెలో బంగారం కొనుగోలుకు వెళ్తున్నట్లు అతను తెలిపాడు. ఆధారాలు చూపలేకపోవడంతో ఎస్‌ఐ నగదును సీజ్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించారు.


