జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ
గుంటూరు వెస్ట్: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలకు రెగ్యులర్ పదవ తరగతి విద్యార్థులతోపాటు, ఓపెన్ స్కూలింగ్ పదవ తరగతి విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. జిల్లాలో మొత్తం 18 పరీక్ష కేంద్రాలలో మొత్తం కలిపి మూడు వేల మంది విద్యార్థులు రాస్తారని చెప్పారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి కాకుండా బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఓఆర్‌ఎస్‌తో పాటు అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. వేసవి తీవ్రత రీత్యా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించడం జరుగుతుందని, పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉండాలన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ సలీంబాషా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షల నిర్వహణకు అధికారులందరు సహకరించాలని కోరారు. డీఆర్వో షేక్ ఖాజావలి, డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


