● వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార
ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు
● ప్రజా సమస్యలపై
నిత్యం పోరుడుతాం
భట్టిప్రోలు: భట్టిప్రోలు గ్రామంలోని ఓ దేవాలయం, బడి పక్కన మద్యం షాపులు పెట్టి మైనర్ బాలురకు మద్యం విక్రయించడాన్ని ప్రశ్నించినందుకు తనపై రెండు అక్రమ కేసులు బనాయించారని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు ఆరోపించారు. ఈ అక్రమ మద్యం కేసులో మంగళవారం రేపల్లె పట్టణ కోర్టుకు అశోక్‌బాబు పార్టీ నేతలతో కలసి హాజరయ్యారు. అశోక్‌బాబు మాట్లాడుతూ పవిత్రమైన దేవాలయం, చిన్నారులు చదువుకునే బడి పక్కన మద్యం షాపు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. తనతో పాటు మరో 17 మందిపై రెండు అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. మైనర్ బాలురకు మద్యం విక్రయించడం చట్టవిరుద్ధం. సమాజాన్ని నాశనం చేసేలాంటి పనులను ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అవినీతిపై తన పోరాటం ఆగదని...న్యాయం గెలుస్తుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని విమర్శించారు. కోర్టుకు భారీ సంఖ్యలో వేమూరుతో పాటు రేపల్లెకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చి అశోక్‌బాబుకు సంఘీభావం తెలియ చేశారు. కార్యక్రమంలో డి.ప్రతాప్, డి.కిరణ్‌బాబు, ఎం.కోటేశ్వరరావు, యలమంద, సయ్యద్ నబీ, వి. నాగేశ్వరరావు, సిరాజుద్ధీన్, తదితరులు ఉన్నారు.


