సీనియారిటీ ప్రకారం కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

సీనియారిటీ ప్రకారం కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలి

May 19 2026 1:46 AM | Updated on May 19 2026 1:46 AM

పర్చూరు(చినగంజాం): జోన్‌3 (గుంటూరు, ప్రకాశం, నెల్లూరు) పరిధిలోని గ్రేడ్‌ 3 పంచాయతీ కార్యదర్శులకు సీనియార్టీ ప్రకారం గ్రేడ్‌ 2 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రధాన కార్యదర్శి మెరుగోలు బెన్‌హర్‌ ప్రభుత్వాన్ని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సీనియార్టీ జాబితాను ప్రకటించకుండా తమను పక్కన పెట్టి తమ కంటే జూనియర్‌లకు పదోన్నతులు కల్పించారని ఆయన మండిపడ్డారు. అక్రమ పద్ధతిలో ఇటీవల ఇచ్చిన పదోన్నతులను వెంటనే రద్దు చేయాలన్నారు. దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌ వద్ద పలుమార్లు ధర్నాలు నిర్వహించి గ్రీవెన్స్‌లో అర్జీలు సమర్పించినా ఫలితం లేదని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. అందుకే రాష్ట్ర హైకోర్టులో కేసు వేసినట్లు చెప్పారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా రెండు రోజుల కిందట తమ కంటే జూనియర్‌లు అయిన మరో 94 మంది పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్‌ 2 పంచాయతీ అధికారులుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఏపీ స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీసెస్‌ 1996 రూల్‌ 24 ప్రకారం పదోన్నతుల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాలి కానీ సంబంధిత అధికారులు సీనియారిటీ లిస్టుని ప్రకటించకుండా తమ ఇష్టం వచ్చినట్లు దొడ్డిదారిన పదోన్నతులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన అర్హులైన వారికి అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 మార్చి 2024లో ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వస్తుందని తెలిసి 15 మార్చి 2024 అర్ధరాత్రి ప్రమోషన్‌ ఆర్డర్‌ తీసుకొని అదే రోజు గ్రేడ్‌ 2 పంచాయతీ కార్యదర్శులుగా కొందరు దొడ్డిదారిన ప్రమోషన్‌లు పొందినట్లు వివరించారు. శారీరక వికలాంగులైన పోలిశెట్టి శ్రీనివాసరావు, కే రవిలను ప్రమోషన్‌ లిస్టులో వీహెచ్‌గా (గుడ్డివారు) చూపించి అడ్డదారిలో ప్రమోషన్‌లు కల్పించారని వివరించారు. పంచాయతీ కార్యదర్శులలో గుడ్డివారు లేరని తెలిపారు. అదే లిస్టులో ఏసీబీ కేసులో నెల్లూరు జైలులో ఉన్న ఎం బాలు నాయక్‌కి కూడా ప్రమోషన్‌ కల్పించారని తెలిపారు. 15 మార్చి 2024న ఇచ్చిన ప్రమోషన్‌ లిస్టులో 14 మంది మాత్రమే అదే రోజున జాయిన్‌ అవ్వగా మిగిలిన 135 మంది రెండేళ్ల తరువాత అంటే 16 మార్చి 2026న జాయిన్‌ అయినట్లు తెలిపారు. అధికారులు ఇచ్చిన రెండు ప్రమోషన్‌ల లిస్టులో తమ పేర్లు లేవని తెలిపారు. ప్రస్తుతం ప్రమోషన్‌ పొందిన వారి కంటే తాము సీనియర్‌ల మని అన్నారు. తమపై అధికారులు కక్ష కట్టి తమ ప్రమోషన్‌ రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు దొడ్డి దారిన ఇచ్చిన రెండు ప్రమోషన్‌ లిస్టులను వెంటనే నిలుపుదల చేసి జోనల్‌ సీనియార్టీ లిస్టుని, జిల్లా సీనియార్టీ లిస్టులను బహిర్గతం చేసి పారదర్శకంగా ప్రమోషన్‌లను చేపట్టి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

పంచాయతీ కార్యదర్శుల డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement